ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియపై ఓ స్పష్టత వచ్చింది. బరిలో నిలిచిన అభ్యర్థులు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ గ్రెగ్ బాక్లీ, ఐసీసీ తాత్కాలిక ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజాలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 16 ఓట్లలో మూడింట రెండొంతులు లేదా 11 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తాడు. ఒకవేళ తొలి రౌండ్లో ఎవరికీ మెజారిటీ రాకపోతే రెండో రౌండ్ ఓటింగ్ నిర్వహిస్తారు. అందులోనూ ఫలితం తేలకపోతే మూడో రౌండ్ ఓటింగ్ ఉంటుంది. అప్పటికీ ఎవరికీ మెజారిటీ రాకపోతే ఖవాజానే కొంతకాలం పాటు పూర్తిస్థాయి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
రహాస్య బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఛైర్మన్ పదవిని కట్టబెట్టనున్నారు. ఆ ఓటింగ్ జరిగిన వెంటనే ఐసీసీ వార్షిక త్రైమాసిక సమావేశం ఆరంభం కానుంది. ఈ తొలి రౌండ్లో ఫలితం తేలకపోతే.. రెండో రౌండ్ ఓటింగ్‌ను వారం తర్వాత నిర్వహించే వీలుంది. శశాంక్ మనోహర్ నిష్క్రమణతో దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ఛైర్మన్ స్థానంలో కొత్త వాళ్లను వచ్చే నెల 2 లోపు ఎన్నుకోవాల్సి ఉంది.