ప్రస్తుత క్రికెట్లో టీ20 ప్రపంచకప్ కంటే ఐపీఎల్‌కే ఎక్కువ విలువ ఉందని, అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే లీగ్‌లకే అధిక ప్రాధాన్యతనివ్వాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరున్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఛైర్మన్ పదవి రేసులో నిలవాలని భావిస్తున్న అతను ఐపీఎల్‌తో పాటు వివిధ దేశాల్లో జరుగుతున్న లీగ్‌లను సుదీర్ఘ కాలం పాటు నిర్వహించాలని చెబుతున్నాడు. అయితే ఐసీసీ ఛైర్మన్‌గా పోటీచేసేందుకు అతనికి సీడబ్ల్యూఐ మద్దతు ఇవ్వట్లేదు.
"ఐపీఎల్ వ్యవధి ఇంకా పెరగాలి. ఈపీఎల్, లా లిగా లాంటి ఫుట్‌బాల్ లీగ్‌ల్లాగే ఈ టీ20 క్రికెట్ టోర్నీలు కూడా ఏకకాలంలో జరగాలి. అప్ఘానిస్థాన్, ఐర్లాండ్ లాంటి చిన్న జట్లకు టెస్టు క్రికెట్ ఆడడాన్ని కేవలం ఓ అవకాశంగా మాత్రమే కల్పించాలి కానీ తప్పనిసరి చేయకూడదు. టీ20 ప్రపంచకప్ కంటే ఐపీఎల్‌కే విలువ ఎక్కువ. ఆ లీగ్ ద్వారా ఆటగాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఆటగాళ్లు ప్రపంచకప్ కంటే భారత లీగ్‌లో ఆడేందుకే మొగ్గుచూపుతారు."
-డేవ్ కామెరూన్, సీడబ్ల్యూఐ మాజీ అధ్యక్షుడు
ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీచేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నానని, బరిలో నిలిచేందుకు తనకు కావాల్సిన మద్దతు ఉందని కామెరున్ చెప్పాడు.