2019 సంవత్సరంలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు పురస్కారాలు ప్రకటించింది ఐసీసీ. తాజాగా ఈ జాబితాను విడుదల చేసింది. అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు 6 మంది చోటు దక్కించుకున్నారు. ఐసీసీ వన్డే, టెస్టు జట్టుకు సారథిగా కోహ్లీని ఎంపిక చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి.
వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్...
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ అరుదైన పురస్కారానికి ఎంపికయ్యాడు. 2019గాను 'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును ఇతడికి ప్రకటించింది ఐసీసీ. గతేడాది ప్రపంచకప్‌లో 5 శతకాలు చేసిన హిట్‌మ్యాన్... మొత్తం 7 వన్డే సెంచరీలు నమోదు చేశాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
స్పిరిట్ ఆఫ్ క్రికెట్...
టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అవార్డు లభించింది. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో స్మిత్ ప్రదర్శనకు చప్పట్లు కొట్టాలని అభిమానులను కోరాడు విరాట్. అంతేకాకుండా పలు సందర్భాల్లో ప్రత్యర్థి జట్టును ప్రశంసిస్తూ క్రికెట్లో స్ఫూర్తిదాయకంగా నడుచుకున్నందుకు కోహ్లికి ఈ అవార్డు లభించింది.
టీ20ల్లో బెస్ట్ ప్రదర్శన...
భారత యువ బౌలర్ దీపక్ చాహర్ టీ20ల్లో గతేడాది అద్భుత ప్రదర్శన చేశాడు. నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఇది పురుషుల టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు. ఈ ప్రదర్శనకుగానూ ఇతడికి 'ఐసీసీ మెన్స్ టీ20 పెర్ఫార్మెన్స్' అవార్డు లభించింది.
మెన్స్ టెస్టు క్రికెటర్...
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్.. గతేడాది మొత్తంగా 59 టెస్టు వికెట్లు సాధించాడు. అందరి బౌలర్ల కంటే 14 వికెట్లు ఎక్కువ తీయడం విశేషం. ఫలితంగా ఇతడికి 'టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు ప్రకటించింది ఐసీసీ.
ఐసీసీ మెన్స్ క్రికెటర్..
ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన ఆ దేశ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కు 'సర్ గారీఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీ' అందించనుంది. ఇతడిని 'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్'గా ప్రకటించింది.
ఎమర్జింగ్ క్రికెటర్...
ఆస్ట్రేలియా సంచలన బ్యాట్స్‌మన్ మార్కస్ లబుషేన్.. 'ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్'గా అవార్డు అందుకోనున్నాడు. 2019లో టెస్టుల్లో 64.94 సగటుతో రాణించాడు. ఇతడు గతేడాది 11 మ్యాచ్‌లు ఆడి 1100 పైగా పరుగులు చేశాడు.
అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్...
టీ20 వరల్డ్‌కప్-2020లో స్కాట్లాండ్ జట్టు క్వాలిఫై కావడంలో కీలకపాత్ర పోషించి కైల్ కోట్జర్కు 'అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు దక్కింది. 2019లో ఈ జట్టు తరఫున ఇతడు 48.88 సగటుతో పరుగులు చేశాడు.
అంపైర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు...
రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌కు ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-2019 అవార్డు లభించింది.
ఐసీసీ వన్డే జట్టు...
రోహిత్ శర్మ, షై హోప్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), బాబర్ అజామ్, విలియమ్సన్, స్టోక్స్, బట్లర్(కీపర్), స్టార్క్, బౌల్ట్, షమి, కుల్దీప్ యాదవ్
ఐసీసీ టెస్టు జట్టు...
మయాంక్ అగర్వాల్, టామ్ లాథమ్, లబుషేన్, కోహ్లీ(కెప్టెన్),స్మిత్, వాట్లింగ్, స్టోక్స్, కమిన్స్, స్టార్క్,వాగ్నర్, నాథన్ లియోన్
>> ఐసీసీ ప్రకటించిన రెండు జట్లలో కెప్టెన్‌గా కోహ్లీనే ఎంపిక చేసింది ఐసీసీ. భారత స్టార్ పేసర్ బుమ్రాకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. టెస్టుల్లో గతేడాది అరంగేట్రం చేసిన మయాంక్.. టెస్టు జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా రెండు జట్లలోనూ ఇంగ్లాండ్ క్రికెటర్ స్టోక్స్ స్థానం సంపాదించుకోగా.. బౌలింగ్ విభాగంలో స్టోక్స్, స్టార్క్ వన్డేలు, టెస్టుల్లోనూ చోటు పొందారు. టెస్టు జట్టులో ఆస్ట్రేలియా(5),న్యూజిలాండ్(3), భారత్(2), ఇంగ్లాండ్(1) ఆటగాళ్లకు స్థానం లభించింది.