'ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగానే తెలుసు అందరికీ. ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి అని, కాలేజీ రోజుల్లో మ్యాచ్‌లు ఆడేవారని, ఆ తర్వాత క్రికెట్ చూడటం మహా ఇష్టమని చాలామందికి తెలియదు. తన క్రికెట్ పిచ్చి గురించి 2011 వన్డే ప్రపంచకప్ ముంగిట బాలు ‘ఈనాడు’తో ముచ్చటించారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే..
"కాలేజీలో చేరినప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం పెంచుకున్నా. బ్యాటింగ్ అంతగా రాదుగానీ స్పిన్ బాగా తిప్పేవాణ్ని. అందుకే బ్యాట్స్‌మన్‌గా నా స్థానం చివర్నే. అప్పట్లో ఎక్కువగా టెస్ట్ మ్యాచ్‌లే ఉండేవి. మద్రాసు నెహ్రూ స్టేడియంలో మ్యాచ్ అంటే ఆ ఐదు రోజులూ అక్కడే ఉండేవాణ్ని. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో మనవాళ్లు కప్పు గెలిచినప్పటి టేపులు ఇప్పటికీ నా దగ్గరున్నాయి. మా ఇంట్లో నాలుగు టీవీలు పెట్టుకుని మరీ చూశాం. పొరబాటున లేదా పని మీద వేరే గదిలోకి వెళ్తే ఏ షాటైనా మిస్సవుతామేమో అని అలా ఏర్పాటు చేయించా. నా మిత్రుడు విఠల్, నా బంధువు కుమార్ వెస్టిండీస్ అభిమానులు. ఆ జట్టు వాళ్లు ఓ వికెట్ తీసినా, ఓ మంచి షాట్ కొట్టినా విఠల్, కుమార్ చేసే హడావుడికి బాధగా ఉండేది. ఓ దశలో కుమార్‌ను 'ఇంట్లోంచి బయటికి వెళ్లు' అని కూడా కసురుకున్నా."
"గత వరల్డ్ కప్ (2007) సమయానికి నేను లాస్‌ఏంజెలెస్‌లో ఉన్నా. ఎ.ఆర్.రెహమాన్‌తో కలిసి ఓ కచేరి కోసం అక్కడికి వెళ్లా. మ్యాచ్ చూడాలని ఉందని రెహమాన్‌కి చెబితే హోటల్ లాంజ్‌లో టీవీ పెట్టించాడు. నేను, హరిహరన్, ఇంకొంతమంది కలిసి చూశాం. మనవాళ్లు ఓడిపోయారనుకోండి. ఈసారి పపంచకప్‌కు ఓ విశేషం ఉంది. సచిన్ ఆడే చివరి వరల్డ్ కప్ ఇదే కావచ్చు అందుకే మన జట్టు బాగా ఆడి విజేతగా నిలవాలి. సచిన్‌కు కప్ కానుకగా ఇవ్వాలి. ఓ భారతీయుడిగా మనమే కప్ గెలవాలని కోరుకుంటున్నాను. మనసులో మరో కోరిక ఉంది. క్రికెట్‌కి ఆద్యులైన ఇంగ్లాండ్ కూడా ఎప్పటికైనా విజేతగా నిలవాలి" అని బాలు చెప్పారు.
* అప్పుడు బాలు కోరుకున్నట్లే టీమ్‌ఇండియా కప్పు గెలిచి సచిన్‌కు కానుకగా అందించింది. అలాగే ఎప్పటికైనా ఇంగ్లాండ్ కప్పు గెలవాలన్న బాలు కోరిక కూడా గతేడాది నెరవేరడం విశేషం.