ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో టీమ్‌ఇండియా విజయంలో హెడ్‌కోచ్ రవిశాస్త్రికే ఎక్కువ క్రెడిట్ ఇస్తానని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మన్ రమిజ్‌రాజా అన్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అడిలైడ్‌లో భారత్ ఘోర పరాభవం పాలైన తర్వాత 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడం విశేషమని ప్రశంసించాడు.
'ఈ విజయంలో ఎక్కవ క్రెడిట్ కోచ్ రవిశాస్త్రికి ఇస్తా. ఎందుకంటే క్లిష్టపరిస్థితుల్లో.. స్టార్ ఆటగాళ్లు లేకపోయినా జట్టును ముందుకు తీసుకెళ్లాడు. అలాగే ఏ జట్టుకూ తీసిపోమనే భావన డ్రెస్సింగ్ రూమ్‌లో కలిగించడం. ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులను వివరించడం అంత తేలికకాదు' అని రమిజ్ పేర్కొన్నాడు.
'ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే నాకెంతో ఇష్టం. జట్టులో ప్రతి ఒక్కర్నీ సరైన రీతిలో తీర్చిదిద్దాడు. ఆటగాళ్లలో పోరాడే కసిని పెంచాడు. ప్రస్తుత టీమ్‌లో అతడి పాత్ర చాలా ఉంది. అడిలైడ్‌లో టీమ్‌ఇండియా 36 పరుగులకే ఆలౌటయ్యాక రహానె జట్టుకెంతో అవసరమయ్యాడు. ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు నడిపించాడు. అతడు అద్భుతంగా పనిచేశాడు' అని రమిజ్ టీమ్‌ఇండియా సారథులపై ప్రశంసలు కురిపించాడు.
ఇదీ చూడండి: 'కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా జోరు తగ్గదు'