దేశంలో ఇప్పటికీ చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలు, బలహీనతలను అంగీకరించడం లేదని టీమిండియా మాజీ సారథి ధోనీ అన్నాడు. క్రీడల్లో ప్రతి జట్టుకు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కోచ్ అవసరమని స్పష్టం చేశాడు. భారత మాజీ క్రికెటర్లు ఎస్.బద్రీనాథ్, శరవణ కుమార్ సంయుక్తంగా ఏర్పాటు ఎంఫోర్ స్వచ్ఛంద సంస్థ సమావేశంలో మాట్లాడుతూ ధోనీ, కోహ్లీ, అశ్విన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
'దేశంలో ఇప్పటికీ తమ మానసిక బలహీనతలను అంగీకరించని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మనలో చాలామంది వాటిని మానసిక ఆరోగ్య సమస్యలుగా భావిస్తాం. వీటిని ఎవరూ బయటకు చెప్పరు. నేను బ్యాటింగ్ చేసేందుకు వెళ్లి 5-10 బంతులు ఎదుర్కొనేంత వరకు నా గుండె వేగం అమాంతం పెరుగుతుంది. ఒత్తిడిగా అనిపిస్తుంది. కాస్త భయమూ వేస్తుంది. ఎందుకంటే అందరికీ ఇదే అనుభూతి ఉంటుంది. దాన్నెలా ఎదుర్కోవడం?' అని ధోనీ అన్నాడు.
'ఇది చాలా చిన్న సమస్యే. కానీ చాలాసార్లు కోచ్‌తో పంచుకొనేందుకు మొహమాటపడతాం. అందుకే క్రీడల్లో ఆటగాడు, కోచ్‌కూ మధ్య అనుబంధం అత్యంత కీలకం. కనీసం 15 రోజులకు ఒక్కసారైనా మెంటల్ కండిషనింగ్ కోచ్.. జట్టుతో కలవాలి. అప్పుడు ఆయనతో అనుభవాలను పంచుకోవచ్చు. ఆటగాడితో ఆయన నిరంతరం మాట్లాడుతుంటే ఆటలో ఎక్కడ అతడు ప్రభావం చెందుతున్నాడో అర్థమవుతుంది' అని మహీ అన్నాడు.
మానసిక నైపుణ్యాలు పెంచుకొనే శిక్షణ ద్వారా ఆటగాళ్లు క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించొచ్చో ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ వివరించాడు.
'మానసిక ఆరోగ్యం, మానసిక స్పష్టత క్రీడల్లోనే కాదు జీవితంలోనూ ఎంతో ముఖ్యం. క్రికెటర్లు తమను తాము అర్థం చేసుకొనేందుకు, మైదానంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని రాణించేందుకు బద్రీనాథ్, ఎంఫోర్ ఎంతో సాయం చేస్తున్నాయి' అని పేర్కొన్నాడు.