వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌కు ఇప్పట్లో రిటరయ్యే ఆలోచన లేదని తెలుస్తోంది. తాను ఆడితే చూడాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారని, తనకూ క్రికెట్‌పై ఇంకా ఇష్టం పోలేదని అన్నాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది.
"నేనింకా ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నా. ఎందుకంటే ఆటకు నేను చేయాల్సింది చాలా ఉందని నా నమ్మకం. అందుకు నా శరీరమూ సహకరిస్తుంది. రోజులు గడిచేకొద్ది నేను యవ్వనంగా మారుతున్నానని నాకు స్పష్టంగా తెలుస్తోంది" -క్రిస్ గేల్, విండీస్ క్రికెటర్
ఈ సందర్భంగా గేల్ తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. 45 ఏళ్ల వరకు కొనసాగితే బాగుంటుందని, 45 అనేది మంచి సంఖ్య అని జోక్ చేశాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు.
"పొట్టి ప్రపంచకప్‌లో ఆడితే బాగుంటుంది. అందుకు తలుపులు తెరిచి ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నాకన్నా ప్రతిభవంతులైన యువ క్రికెటర్లు కొంత మంది ఉన్నారు. ఈ విషయాన్ని సెలెక్టర్లకే వదిలేస్తున్నా" -క్రిస్ గేల్, విండీస్ బ్యాట్స్‌మన్