గతేడాది ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన టెస్టు ఛాంపియన్షిపర్ ప్రక్రియ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్‌కు ముందు అన్ని జట్లూ ఒకటి లేదా రెండు సిరీస్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటే.. ఈ ఏడాది జులైలో జరిగే ఛాంపియన్షిప్ తుదిపోరులో తలపడతాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న, రాబోయే సిరీస్‌ల ఫలితాల ఆధారంగా స్థానాలు అటుఇటు కావొచ్చు. ఈ రెండు జట్లే టాప్-2లో ఉంటాయన్న గ్యారంటీ లేదు.
భారత్ విషయానికొస్తే.. ఛాంపియన్‌షిప్‌లో అత్యధికంగా 390 పాయింట్లు సాధించిన ఘనత మన జట్టుదే. కానీ పాయింట్లు మన కంటే 68 తక్కువ ఉన్నప్పటికీ.. విజయాల శాతంలో ఆసీస్(76.6) మెరుగ్గా ఉండటం వల్ల భారత్(72.2) రెండో స్థానానికే పరిమితమైంది. న్యూజిలాండ్(360 పాయింట్లు, 66.7 శాతం విజయాలు), ఇంగ్లాండ్(292, 60.8) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాప్-2 స్థానం విషయంలో భారత్‌కు ప్రధానంగా న్యూజిలాండ్ నుంచి ముప్పు పొంచి ఉంది. మంచి ఫామ్‌లో ఉన్న ఆ జట్టు వరుస విజయాలతో భారత్‌కు చేరువవుతోంది. ఆస్ట్రేలియా రెండో టెస్టులో గెలవబట్టి సరిపోయింది కానీ.. పాక్‌ను తొలి టెస్టులో ఓడించాక కివీస్ మన జట్టుకు మరింత దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇకపై భారత్‌కు ప్రతి మ్యాచ్ కీలకమే. ఫైనల్‌కు ముందు ఆడబోయే ఆరు టెస్టుల్లో(ఆస్ట్రేలియాతో 2, ఇంగ్లాండ్‌తో 4) నాలుగు గెలిస్తేనే టాప్-2లో ఉంటాం. రెండు, మూడు గెలిచినా అవకాశం ఉండొచ్చు కానీ.. అప్పుడు వేరే జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి.
ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టుల్లో టీమ్ఇండియా ఒక్కటైనా గెలివాల్సిందే. తర్వాత ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై భారత్ నాలుగు టెస్టులాడనుంది. స్వదేశంలో భారత్ ఫేవరెట్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్‌తో అంత తేలిక కాదు. ఆ సిరీస్‌ను సొంతం చేసుకుంటే భారత్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడబోతున్నట్లే.