కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. ఈ సమయంలో ఇంటికే పరిమితమైన క్రీడాకారులు.. టోర్నీలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయా అని ఆశగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో బయో బబుల్‌ను ఏర్పాటు చేసి అందులో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిరూపించింది. ఇదే నియమావళితో సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్‌ను ప్రారంభించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.
టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు తప్పనిసరిగా ఆరు రోజులు నిర్బంధాన్ని పూర్తి చేసిన తర్వాతే ప్రాక్టీసు మొదలుపెట్టాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ నిబంధనలను ఆటగాళ్లందరూ తప్పక పాటించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది బాధ పడాల్సి వస్తుందని ఆర్సీబీకి చెందిన యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇందులో అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాడు కోహ్లీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లాక్డౌన్లో క్రికెట్‌ను మిస్ అయ్యారా?
నిజం చెప్పాలంటే క్రికెట్‌ను నేను అంతగా మిస్ అవ్వలేదు. దాదాపు పదేళ్ల క్రితం ఒకసారి ఆటకు దూరంగా విశ్రాంతి తీసుకున్నా.. కానీ, ఇంత ఎక్కువ కాలం విరామం తీసుకోవడం ఇదే తొలిసారి. నేను ఆటను మిస్ అయ్యాను అనే భావం నాలో కలగలేదు. ఎందుకంటే ఇలాంటి విరామాలు జీవితంలో ఒక భాగం మాత్రమే.
లాక్డౌన్లో అనుష్కతో మీరు ఏవిధంగా గడిపారు?
లాక్డౌన్లో అనుష్క, నేను ఇంటికే పరిమితమై సమయాన్ని ఉత్తమంగా గడిపాం. నిజం చెప్పాలంటే మేమిద్దరం ఎక్కువ సమయం కలిసి ఉండటం ఇదే తొలిసారి. మీకు ఇష్టమైన వారితో కలిసి ఉండటం కంటే మరేది ఎక్కువ ఆనందాన్ని కలిగించదు. ఏదేమైనా మేమిద్దరం కలిసి మంచి సమయాన్ని ఆస్వాదించాం. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే కొంత సమయం పడుతుంది. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా.. తర్వాత అది అలవాటైపోయింది.
ఆర్సీబీ క్యాంప్‌కు జూమ్ ద్వారా ఏవో సూచనలు చేశారంటా?
ఇటీవలే జూమ్ కాల్లో నేను చెప్పిన మాటలు మా జట్టు ఆటగాళ్లకు ఇబ్బంది కలిగించాయని నేను అనుకోను. ఎందుకంటే బయట పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి మాత్రమే వచ్చాం. దుబాయ్‌లో సరదాగా గడపడానికి రాలేదు. బయో బబుల్ నిబంధనలను ప్రతి ఆటగాడు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.
ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు ఆడటంపై మీ అభిప్రాయం?
ప్రేక్షకులు లేకుండా ఆడాలంటే మొదట్లో కొంచెం అసౌకర్యంగానే ఉంటుంది. ఆ విషయాన్ని నేనూ కాదనలేను. కానీ, ప్రతి ఒక్కరికి వింతగానూ, కొత్తగానూ అనుభూతినిస్తుంది. బంతిని బ్యాట్‌తో కొట్టే శబ్దాన్ని చివరిసారిగా 2010లో ఆడిన రంజీట్రోఫీలో విన్నా. పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వింటాను. మన జీవితంలో ఏంచేశాం అని వెనక్కి తిరిగి చూసుకునే ఏదైనా ఒక అంశాన్ని చెప్పడం కంటే గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా పదేళ్లుగా ప్రేక్షకుల మధ్యలో ఆడటానికి అలవాటు పడిన తర్వాత వారు లేకుండా మ్యాచ్‌లు ఆడటం కొంచెం కష్టంగానే ఉంటుంది.