విరాట్ కోహ్లీ.. పరుగులు చేయడంలో మేటి. మైదానంలో ఆడితే ఎవరూ రారు ఇతడికి పోటీ. అయితే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో కనీసం చేయలేకపోయాడు ఓ ట్వంటీ. ప్రస్తుతం కింగ్ కోహ్లీ విమర్శలకు కేంద్ర బిందువుగా మారాడు. పరుగుల ప్రవాహం పారించిన బ్యాట్.. ప్రస్తుతం తడబడుతోంది. ఆటలో అతడి పోరాటం, మైదానం నుంచి బయటకు వస్తూ అతడు చేసే అభివాదం అన్నీ కనుమరుగయ్యాయి. అందుకే అతడు తలదించుకు వస్తుంటే దేశమంతా నివ్వెరపోతోంది. నీ ఆటతో ఓసారి తలెత్తవా అని సగటు అభిమాని గుండె ప్రతిధ్వనిస్తోంది.
ఓ చేదు జ్ఞాపకమే..
టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి న్యూజిలాండ్ పర్యటన మరో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. 45, 11, 38, 11(టీ20లు) 51, 15, 9(వన్డేలు) 2, 9.. 3, 14(టెస్టులు) ఈ పర్యటన మొత్తంలో కోహ్లీ చేసిన పరుగులివి. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు 14(30 బంతుల్లో 3 ఫోర్లు) మరోసారి నిరాశపర్చాడు.
కివీస్ పర్యటన మొత్తంలో తొలివన్డేలో అర్ధ శతకం మినహా మిగతా ఏ మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు విరాట్. హామిల్టన్ వేదికగా జరిగిన వన్డేలో 51 పరుగులు చేసిన భారత సారథి.. ఆ తర్వాత ఏ పోరులోనూ కనీసం 20 పరుగులు చేయలేకపోయాడు. ఇక సుదీర్ఘ ఫార్మాట్లో మూడంకెల స్కోరు అందుకొని దాదాపు 20 ఇన్నింగ్స్‌లే ముగిశాయి.
మూడోసారి తడ'బ్యాటు'
కోహ్లీ 2011లో తొలిసారి ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు ఫామ్ కోల్పోయి సతమతమయ్యాడు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు ఇదే తరహాలో ఇబ్బంది పడ్డాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తిగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తర్వాత 2018 ఇంగ్లాండ్ పర్యటనలో చెలరేగి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. కోహ్లీ కెరీర్‌లో ఫామ్ కోల్పోవడం ఇది మూడో సారి. ఈ నేపథ్యంలో భారత సారథి ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇదీ చూడండి : పాంచ్ పటాకా: దుబాయ్ ఛాంపియన్షిప్ విజేత జకోవిచ్