మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకుంటానని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ అంటున్నాడు. వారి నుంచి నేర్చుకున్న కెప్టెన్సీ పాఠాలను ఐపీఎల్లో అమలు చేస్తానని పేర్కొన్నాడు. ఎంతో అనుభవజ్ఞుడైన అనిల్ కుంబ్లే (కింగ్స్ కోచ్) తన పక్కనుండటం ఆనందంగా ఉందని వెల్లడించాడు.
"వారు ముగ్గురూ పదేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు. వారితో కలిసి ఆడే అవకాశం నాకు దక్కింది. కోహ్లీ, ధోనీ వ్యక్తిగతంగా భిన్నం. జట్టును నడిపించడంలో అభిరుచి మాత్రం ఒకేలా ఉంటుంది. అయితే వారి పద్ధతులు మాత్రమే వేరు. రోహిత్ ఎలాంటి నాయకుడో మనందరికీ తెలిసిందే. కేన్ విలియమ్సన్ లాంటి ప్రత్యర్థి కెప్టెన్ల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వారి విధానాలనే నేను అనుసరిస్తా"
- కేఎల్ రాహుల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్
కెప్టెన్సీ తన ఆటను దెబ్బతీస్తుందో లేదో తెలియదని, తనకు అప్పగించిన బాధ్యతలను ప్రశాంతంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని రాహుల్ అన్నాడు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
ఇన్నాళ్లూ క్రికెట్ ఆడకపోవడం వల్ల ఆందోళన కలిగిందని రాహుల్ అన్నాడు. భయపడలేదని చెబితే అవాస్తమే అవుతుందన్నాడు. ఈ మూడు వారాల్లో లయ అందుకోవడం, బంతిని చక్కగా బాదడం, మనసు, శరీరం మధ్య సమన్వయం తీసుకురావడం కీలకమని పేర్కొన్నాడు. దుబాయ్, షార్జా, అబుదాబీ పిచ్‌లు మందకొడిగా ఉంటే లక్ష్యాలు 180-190 నుంచి 160-170కి తగ్గుతాయని వెల్లడించాడు.