టెస్టుల్లో ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి వేగంగా పరుగులు సాధించే హార్దిక్ పాండ్య జట్టులో ఉండడం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశమని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి బౌలింగ్ చేయగలిగితేనే టెస్టు జట్టులో ఉండాలని అన్నాడు.
భారత్ × ఆస్ట్రేలియా టెస్టు గురించి ఓ కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ మాట్లాడుతూ.. ఆసీస్ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించిన హార్దిక్ సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపిక కావాల్సిందని అన్నాడు. దీనిపై సెహ్వాగ్ స్పందించాడు.
"హార్దిక్ బౌలింగ్ చేయగలిగితేనే టెస్టు జట్టులో ఉండాలి. వన్డే, టీ20లకు మాత్రమే ఆడతానని, బౌలింగ్‌కు ఫిట్‌నెస్ సాధించలేదనో సెలక్టర్లకు హార్దిక్ చెప్పొచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్ అనంతరం తిరిగి కుటుంబంతో కలుస్తానని అనొచ్చు. అయితే అతడు బౌలింగ్ చేయడం మొదలుపెడితే జట్టులో కీలక ఆటగాడు అవుతాడు. ఎందుకంటే వన్డే, టీ20ల్లో మాదిరిగానే టెస్టు క్రికెట్‌లో ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి హార్దిక్ మెరుపు బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. భారత్ మెరుగైన స్థితిలో నిలుస్తూ గెలుపు దిశగా పయనిస్తుంది" అని సెహ్వాగ్ అన్నాడు.
వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం హార్దిక్ భారత జట్టులోకి వచ్చినా బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. తప్పని పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో మాత్రం నాలుగు ఓవర్లు వేశాడు. అయితే ధనాధన్ ఇన్నింగ్స్‌లతో భారత్ టీ20 సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్ పర్యటనలోని పరిమిత ఓవర్ల క్రికెట్ రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచాడు. డిసెంబర్ 17 నుంచి భారత్×ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.