టీ20 ప్రపంచకప్-2007లో భారత జట్టు విజేతగా నిలవడం ఊహించని పరిణామమని అన్నాడు టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్‌లో అడుగుపెట్టాక తమ జట్టుకు పెద్ద ఎత్తున అభిమానులు మద్దతు పలికారని తెలిపాడు.
మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రాతో జరిగిన లైవ్‌సెషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు హర్భజన్. కెరీర్లో అత్యుత్తమ మూడు మ్యాచ్‌ల గురించి తెలపాలని కోరగా.. అందులో ఈ టీ20 ప్రపంచకప్ ఒకటని సమాధానమిచ్చాడు భజ్జీ. దీంతో పాటు 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్, 2011 ప్రపంచ కప్ తన కెరీర్లో అత్యుత్తమ టోర్నీలు అని వెల్లడించాడు.
"ఓ ఆటగాడిగా 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను నా కెరీర్లో అత్యుత్తమమైందిగా చెబుతా. ఎందుకంటే ఈ సిరీస్ నన్ను ఓ గొప్ప ఆటగాడిగా మీ ముందు నిలబెట్టింది. అలాగే ప్రపంచకప్ నా చిన్నప్పటి కల. 2011లో అది కూడా నెరవేరింది. ఇక 2007 టీ20 ప్రపంచకప్ విషయానికొస్తే.. ఇది ఒక ఊహించని పరిణామం. గెలుస్తామని అనుకోలేదు. కానీ అనూహ్య రీతిలో విజయం సాధించాం. దీంతో మాకు భారత గడ్డపై విశేష ప్రజాదరణ దక్కింది. అందుకే ఈ మూడు టోర్నీలు నా కెరీర్లోనే ప్రత్యేకం."
-హర్భజన్ సింగ్, టీమ్ఇండియా స్పిన్నర్
ఇది చూడండి : '183' కొడితే టీమ్ఇండియా కెప్టెన్సీ వరిస్తుందా?