ఆటతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, టీమ్ఇండియాకు సారథిగానూ.. దేశ ఖ్యాతిని మరో స్థాయికి తీసకెళ్లేందుకు కృషి చేసిన క్రికెటర్ సౌరభ్ గంగూలీ. సన్నిహితులతో పాటు, అభిమానులు ఆయనను ముద్దుగా 'దాదా' అని పిలుచుకుంటారు. క్రికెట్ ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఈయన 48వ పుట్టిన రోజు నేడు. ఏ మ్యాచ్‌లోనైనా జట్టు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు గంగూలీ ఎప్పుడూ వెనకడుగు వేసేవాడు కాదని తోటి ఆటగాళ్లు చెబుతుంటారు. దాదాను 'గాడ్ ఆఫ్ హాఫ్ సైడ్' అని పిలుస్తుంటాడు రాహుల్ ద్రవిడ్.
దశాబ్దకాలం పాటు బ్యాటింగ్‌లో గంగూలీ.. తన మెరుపు వేగంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. దాదా వస్తున్నాడంటే చాలు ప్రత్యర్థి జట్టు తలనొప్పిగా భావించేలా బ్యాటింగ్‌లో విజృంభించాడు. ఈ క్రమంలోనే ఆయన క్రికెట్ ప్రస్థానంతో పాటు, టీమ్ఇండియాను అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి చేసిన కృషిపై ఓ లుక్కేద్దాం.
ఆరంభంలోనే వరుస సెంచరీలు
గంగూలీ.. 1996 వేసవిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. లార్డ్స్ వేదికగా నిర్వహించిన ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో టెస్టులోనూ శతకం కొట్టి, అలా మొదటి రెండు ఇన్నింగ్స్‌లోనే వరుస శతకాలు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. 1997లో వరుసగా నాలుగు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను సొంతం చేసుకున్న ఘనత గంగూలీదే. ఆ తర్వాత 1999 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక- భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కెరీర్లో అత్యధిక పరుగులు (183) పరుగులు చేశాడు.
ఉద్రిక్తతల నడుమ కెప్టెన్‌గా..
క్రికెట్లో భారత్ దూసుకెళ్తున్న క్రమంలో, 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు జట్టును చుట్టుముట్టాయి. సరిగ్గా ఆ సమయంలో కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్నాడు. ఇలాంటి సమయంలో సారథ్యం వహించడం ఎంతో కష్టమే కానీ, దాదాకు అవేవీ అడ్డంకి కాలేదు. సారథిగా మారిన తర్వాతే దాదాలోని అసలైన ప్రతిభ బయటపడింది.
యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్, మహమ్మద్ కైఫ్, ధోనీ, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ లాంటి యువ ప్రతిభావంతులు.. దాదా సారథ్యంలోనే జట్టులోకి వచ్చారు. ఇదే ఆయన ఉత్తమ నాయకత్వ లక్షణానికి నిదర్శనం.
చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్
ఇక 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో గంగూలీ.. టీమ్ఇండియాను ఫైనల్ వరకు నడిపించారు. ఆ తర్వాత 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా గొప్ప విజయాన్ని నమోదు చేసింది.
టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సంగతి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను భారత్ ఓడించినప్పుడు.. గంగూలీ ఆనందంతో తన జెర్సీ విప్పి గిరగిర తిప్పాడు. ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయిన ఘటన ఇది.
దాయది గడ్డపై తొలి విజయం
2003లో ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియాకు దిశానిర్దేశం చేశారు గంగూలీ. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. 2004లో పాకిస్థాన్‌లో జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లకు భారత జట్టుకు సారథ్య వహించారు దాదా. ఈ టెస్టు సిరీస్‌లో పాక్ గడ్డపై భారత్ ఘనవిజయం సాధించింది. దాయాది దేశంలో టీమ్ఇండియా సాధించిన తొలి గెలుపు ఇదే.
అలా కెప్టెన్సీకి దూరం..
2005వ సంవత్సంలో టీమ్ఇండియా జట్టు కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్‌ను నియమితుడయ్యాడు. ఈ క్రమంలో జట్టులో తలెత్తిన విభేదాల కారణంగా కెప్టెన్ పదవి నుంచి దాదా తప్పుకున్నాడు. అయితే, గంగూలీ దురుసుగా ప్రవర్తించాడని, జట్టులో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాడని ఛాపెల్ విమర్శించారు.
ఆఖరి టెస్టు సిరీస్
ఆస్ట్రేలియాతో 2008 నాగ్‌పుర్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడాడు గంగూలీ. ఆ తర్వాత ఐపీఎల్లో కొనసాగాడు. కానీ, 2012లో దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
దాదా ఉత్తమ ప్రదర్శన..
ఇప్పటి వరకు భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు గంగూలీ. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు సాధించాడు. 195 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు సారథిగా వ్యవహరించగా.. ఇందులో 97 మ్యాచ్‌లను గెలిపించాడు. భారత్‌లో డే/నైట్ టెస్ట్ క్రికెట్ ఆలోచనను ముందుకు తీసుకురావడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు.
గతంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాదా.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.