భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియాన్ని సందర్శించారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బంగాల్ (సీఏబీ) చేస్తోన్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఏబీ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియాతో పాటు సెక్రటరీ స్నేహాషిస్ గంగూలీ, జాయింట్ సెక్రటరీ దేవవ్రత దాస్‌తో దాదా మాట్లాడారు.
ముస్తాక్ అలీ టోర్నీ కోసం బంగాల్ టీమ్ ఎలా సన్నద్ధమవుతుందనే విషయంపై ఆ జట్టు కోచ్ అరుణ్ లాల్‌ను గంగూలీ అడిగి తెలుసుకున్నారు. బంగాల్ టీమ్‌లోని ఆటగాళ్లతో కొద్దిసేపు ముచ్చటించారు.
ఆ జట్టుతో సంతృప్తి..
ఈ టీ20 ఫార్మాట్ కోసం బంగాల్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
"నాకు తెలిసి ఈ టోర్నీ కోసం బంగాల్ ఆటగాళ్లు బాగా సన్నద్ధమవుతున్నారు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ బంతిని కొట్టే తీరుతో నేను సంతృప్తిగా ఉన్నా. పొట్టి ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు ఆ టీమ్‌కు బంగాల్ టీ20 ఛాలెంజ్ ఉపయోగపడింది. ఈ అనుభవంతో బంగాల్ జట్టు ట్రోఫీని దక్కించుకుంటుందని ఆశిస్తున్నా".
- వీవీఎస్ లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోని నాకౌట్ మ్యాచ్‌లను అహ్మాదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో నిర్వహించనున్నారు. అంటే టోర్నీలోని క్వార్టర్ ఫైనల్స్ (జనవరి 26-27), సెమీఫైనల్స్ (జనవరి 29), ఫైనల్ (జనవరి 31) మ్యాచ్‌లను మోతేరాలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఇదీ చూడండి: భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వాయిదా