తూర్పు దిల్లీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. దిల్లీ ప్రభుత్వానికి రూ.50 లక్షలు సాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. కరోనాను అరికట్టటంలో భాగంగా వైద్యపరికరాలు కొనుగోలు చేసేందుకు, తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వబోతున్నట్లు సోమవారం వెల్లడించాడు.
"కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, దిల్లీలోని పలు ఆసుపత్రుల్లో అందుకు తగ్గ వైద్య పరికరాలు కావాలని ఇటీవలే ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. రెండు వారాల క్రితం నేను చెప్పినట్లు ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను. దీనిని పరికరాల కోసం, కొవిడ్ 19 బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఉపయోగిస్తారని అనుకుంటున్నా" -దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో గౌతమ్ గంభీర్
అయితే పీపీఈ కిట్స్, మాస్క్‌ల విషయంలో దిల్లీ ప్రభుత్వం.. కేంద్రంపై మొసలి కన్నీరు కారుస్తుందని అన్నాడు గంభీర్. వీటికోసం తను కొంత మొత్తాన్ని ఇస్తానని చెప్పిన తర్వాత, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పాడు. దిల్లీలో ఇప్పటివరకు 500 మందికి పైగా కరోనా సోకగా, ఏడుగురు మరణించారు.