ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త సీజన్ ఆరంభానికి పట్టుమని పది రోజుల సమయం లేదు. పరిష్కరించాల్సిన సమస్యలు మాత్రం చాలానే ఉన్నాయట. అనేక అంశాలపై ఐపీఎల్ పాలక మండలి సరిగా స్పందించడం లేదని ఫ్రాంచైజీలన్నీ గుర్రుగా ఉన్నాయని తెలిసింది. విసిగి వేసారిపోయిన ఫ్రాంచైజీలు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతోనే నేరుగా మాట్లాడేందుకు నిర్ణయించుకున్నాయట. అందుకే లీగ్ సన్నాహాలను పర్యవేక్షించేందుకు బుధవారం దాదా దుబాయ్‌కి వచ్చారని ఐపీఎల్ వర్గాల సమాచారం.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్ల క్వారంటైన్ అంశంపై ఐపీఎల్ పాలక మండలిని ఎంత అడిగినా స్పష్టత ఇవ్వలేదట. వారిని క్వారంటైన్‌లో ఉంచాలా? అవసరం లేదా? ఏం చేయమంటారు? వంటి ప్రశ్నలు అడిగితే స్పందించకుండా ఆలస్యం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ రెండు జట్లు ఇంగ్లాండ్‌లో ద్వైపాక్షిక సిరీసులు ఆడుతున్నాయి. టీ20 సిరీస్ ముగిసింది. 11 నుంచి 16 వరకు మూడు వన్డేల సిరీసులో తలపడతాయి. ఆ తర్వాత దాదాపు 22 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు దుబాయ్ చేరుకోవాలి. ముంబయి ఇండియన్స్ మినహా ఏడు ఫ్రాంచైజీలు రూ.కోటి ఖర్చుపెట్టి వీరందరినీ ఒకే విమానంలో తీసుకురాబోతున్నాయి.
భారత్ లేదా విదేశాల నుంచి దుబాయ్, అబుదాబికి చేరుకున్న ఆటగాళ్లు నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్నారు. నెగిటివ్‌గా తేలడం వల్ల రోజూ సాధన చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్ కూడా బయో బుడగలోనే జరుగుతోంది. ఒక బయో బుడగ నుంచి సురక్షితంగా మరో బయో బడుగలో అడుగుపెడితే క్వారంటైన్ అవసరమా? వద్దా? అనే విషయం అడిగితే ఐపీఎల్ పాలక మండలి స్పందించలేదు. అందుకే ఫ్రాంచైజీలు ఆగ్రహంతో ఉన్నాయి. దుబాయ్‌లో అడుగుపెట్టిన దాదా నేడు ఫ్రాంచైజీలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.