రెండో ప్రపంచ యుద్ధం చేయలేనిది కూడా కరోనా మహమ్మారి చేసిచూపించింది. 1934-35 నుంచి 87 ఏళ్లుగా కొనసాగుతున్న రంజీ ట్రోఫీని ఈ ఏడాది రద్దు చేయడానికి కారణమైంది. ఈ వేదికను వినియోగించుకొని అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటిన ఎందరో ఆటగాళ్లు.. టోర్నీ రద్దు నిర్ణయంతో యువ క్రికెటర్లపై సానుభూతి ప్రకటించారు. అదే సమయంలో.. రంజీ నిర్వహణకు పరిస్థితులు అనుకూలించనందున బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించారు.
"యువ క్రికెటర్లకు నా సానుభూతి. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోగలను. అయితే అందరి మంచి కోరే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నా."
- చంద్రకాంత్ పండిత్ , భారత మాజీ కీపర్, దేశవాళీ క్రికెట్ కోచ్.
రంజీ నిర్వహించనప్పటికీ విజయ్ హజారే, మహిళల వన్డే టోర్నీ, అండర్-19 యువకుల కోసం వినూ మన్కడ్ ట్రోఫీ జరపనుంది బీసీసీఐ.
"కనీసం రెండు టోర్నమెంట్లు అయినా జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నా. రంజీని కుదించి నిర్వహించడం వీలు పడుతుందేమో ఆలోచించాలి. కానీ, ఉన్న కొంచెం సమయంలోనే అండర్-19 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని విను మన్కడ్‌ను కూడా బీసీసీఐ నిర్వహించాల్సి ఉంది," అని చంద్రకాంత్ అన్నారు.
"నిజానికి రంజీ ట్రోఫీ జరగాలనే కోరుకున్నా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 38 జట్లు, ఎంతో మంది క్రికెటర్లు, ఎన్నో వేదికలతో అది చాలా కష్టం. రంజీలు జరగకపోవడం చాలా బాధాకరం. ఎర్రబంతి ఫార్మాట్లో ఆడే క్రికెటర్లకు ఎంతో కష్టం. దాదాపు 18 నెలలు వారు ఆటకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. విజయ్ హజారేలో ఆటగాడికి ఆటకు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు వస్తాయి. కాని అది ఎంత మాత్రం సరిపోదు. డబ్బు కూడా 6 నెలల తర్వాతే అందుతుంది. మ్యాచ్ ఫీజుపైనే ఆధారపడిన క్రికెటర్లకు కుటుంబ పోషణ మరింత భారంకానుంది."
-వసీమ్ జాఫర్, రంజీ దిగ్గజం, ఉత్తరాఖండ్ కోచ్.
పూర్తి రంజీ, విజయ్ హజారే, ముస్తాక్ అలీ, దిలీప్ ట్రోఫీలు ఆడితే ఒక సీజన్‌కు రాష్ట్ర జట్టుకు రూ.15 నుంచి 20 లక్షలు వస్తాయి. కానీ ఈసారి అందులో సగం కన్నా తక్కువే అందనున్నాయి. అయితే దేశవాళీ క్రికెటర్లకు పరిహారం ఇస్తామని బీసీసీఐ ప్రకటించడం కాస్త ఊరటనిచ్చే అంశం.
"మూడున్నర నెలల పాటు 800మంది క్రికెటర్లు బయోబబుల్‌లో ఉండటం చాలా కష్టం. బయోబబుల్‌లో 4నెలల పాటు రంజీ నిర్వహించడమనేది సరైన ఆలోచన కాదు."
- అశోక్ మల్హోత్రా, భారత క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు.
"బబుల్‌లో ప్రతి రెండో రోజు ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ఎక్కువగా తిరగడానికి ఉండదు. నాలుగు నెలలపాటు బయటికి వెళ్లడానికి లేదు. వృద్ధ తల్లిదండ్రులు, చిన్నపిల్లలున్న క్రికెటర్లు.. వారిని కలుసుకోలేరు. నెలలపాటు ఒకే హోటల్ గదిలో ఉండటం మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందువల్ల రంజీ బదులు విజయ్ హజారే నిర్వహించడం సరైన పనే."
- రణదేవ్ బోస్, బంగాల్ బౌలింగ్ కోచ్.
రంజీల నుంచి భారత్-ఏకు ఎంపికయ్యే ఆటగాళ్లకు ఈసారి ఆ అవకాశం లేకపోవడం పట్ల బోస్, మల్హోత్రా ఒకే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ-జట్టుకు 20-22 మంది క్రికెటర్లు నేరుగా ఎంపికవుతారని, రంజీల నుంచి సీజన్‌కు ఒకరికి మించి అవకాశం ఉండదని చెప్పారు.
ఇదీ చూడండి: దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణ దిశగా బీసీసీఐ