రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీని ఐపీఎల్ ఆరంభ టోర్నీలో దిల్లీ డేర్‌డెవిల్స్(డీడీ) ఎందుకు తీసుకోలేదో తెలిసింది. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ సందర్భంగా నిర్వహించిన వేలంలో ఆ జట్టు కోహ్లీని వదిలేసింది. దీంతో అప్పటి నుంచీ అతడు ఆర్సీబీతో కొనసాగుతున్నాడు. అప్పట్లో దిల్లీ ఎందుకు తీసుకోలేదనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. ఐపీఎల్ మాజీ సీఓఓ సుందర్ రామన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ కారణాలను వెల్లడించారు. అసలా ప్రక్రియ ఎలా సాగిందో వివరించారు.
"ఆ ఏడాది కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. అది కూడా ఐపీఎల్ వేలానికి నెలరోజుల ముందే. దాంతో ఆ ఆటగాళ్లకు ప్రత్యేక వేలం నిర్వహించాలని భావించాం. అప్పటికే కోహ్లీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏ ఫ్రాంఛైజీ అయినా తొలుత అతడినే తీసుకుంటుందని భావించారు. ఈ క్రమంలోనే దిల్లీ డేర్‌డెవిల్స్ లోకల్ బాయ్‌ని తీసుకుంటుందని ఊహించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆ జట్టు కోహ్లీని పాస్ చేసింది. అతడికి బదులు ప్రదీప్ సంగ్వాన్‌ను తీసుకుంది. ఎందుకంటే వారికి ఇంకో బ్యాట్స్‌మన్ అవసరం లేదని చెప్పారు. నిజంగానే వారికా అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే ఆ జట్టులో సెహ్వాగ్, డివిలియర్స్ ఉన్నారు. వాళ్ల నిర్ణయం సరైందే. తర్వాత ఆర్సీబీ కోహ్లీని తీసుకుంది."
-సుందర్ రామన్, ఐపీఎల్ మాజీ సీఓఓ
తొలి సీజన్ నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 177 మ్యాచ్‌లాడి 37.85 సగటుతో 5,412 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దిల్లీ తీసుకున్న సంగ్వాన్ 39 మ్యాచ్‌ల్లో 8.79 ఎకానమీతో 35 వికెట్లు తీశాడు. తర్వాత డోపింగ్ టెస్టుల్లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్నాడు.