భారత జట్టు సెలక్టర్ల పదవికి రేసులో నిలిచాడు టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్. ఇప్పటికే ఈ పదవులకు తీవ్రమైన పోటీ ఏర్పడగా... అది మరింత పెరిగింది. నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. ఇప్పటివరకు మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ ఆఫ్ స్పిన్నర్ రాజేశ్ చౌహాన్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అమే ఖురేషియా పోటీలో ఉండేవారు. తాజాగా వీరితో పాటు అగార్కర్ కూడా రేసులో నిలిచాడు.
ఇప్పటికే సెలక్షన్ కమిటీలో ముంబయికి చెందిన జతిన్ పరాంజపే ఉన్నాడు. ఇతడికి మరో ఏడాది గడువుంది. అజిత్ ఎంపికైతే ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహించనున్నారు.
అగార్కర్‌కు అనుభవం...
42 ఏళ్ల అజిత్ అగార్కర్ గతంలో ముంబయి సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా పనిచేశాడు. ఇతడికి 26 టెస్టులు, 191 వన్డేలు, 3 టీ20లు ఆడిన అనుభవం ఉంది. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు తీశాడు. వన్డేల్లో 288 వికెట్లు తీసిన అగార్కర్.. అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా ఉన్నాడు. ఇతడి కంటే ముందు అనిల్ కుంబ్లే(334), జవగళ్ శ్రీనాథ్(315) జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా వన్డేల్లో వేగంగా(21 బంతుల్లో) అర్ధశతకం చేసిన భారతీయ బ్యాట్స్‌మన్‌గానూ రికార్డు ఇతడి పేరిటే ఉంది.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ప్రకారం చూస్తే... అజిత్ అగార్కర్(ముంబయి), చేతన్ శర్మ(హర్యానా), నయన్ మోంగియా(బరోడా), లక్ష్మన్ శివరామకృష్ణన్(తమిళనాడు), రాజేశ్ చౌహన్(మధ్యప్రదేశ్), అమే కురేషియా(మధ్య ప్రదేశ్) ఉన్నారు. వీరితో పాటు జ్ఞానేంద్ర పాండే(ఉత్తరప్రదేశ్) కూడా ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నా ఇతడు ఇప్పటికే జూనియర్ జట్టు సెలక్టర్‌గా నాలుగేళ్లు పనిచేశాడు. అంతేకాకుండా ప్రీతమ్ గాంధీ(విదర్భ) గతంలో జాతీయ జట్టుకు జూనియర్ సెలక్టర్‌గా నాలుగేళ్లు పనిచేశాడు.
జూనియర్ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ వెంకటేశ్ ప్రసాద్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా ఈ పదవులకు పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు వారిద్దరి దరఖాస్తులపై ఎటువంటి సమాచారం లేదు.
జాతీయ జట్టులో ఇద్దరికే..!
సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్ జోన్), గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) పదవీకాలం ముగిసింది. వీరి స్థానాల్లో బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ కొత్తవారిని ఎంపిక చేయనుంది. మిగతా సభ్యులు శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్), జతిన్ పరాంజపె (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్) మరో సంవత్సరం పాటు కొనసాగుతారు.
ఇవీ చదవండి...