టీమ్ఇండియా వికెట్ కీపర్- బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ప్రతిభావంతుడైన ఆటగాడని భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నారు. అయితే ప్రశాంతతో ఆడటం నేర్చుకోకపోతే అతని సామర్థ్యం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎక్కువ సేపు మైదానంలో ఉండే నైపుణ్యాన్ని పంత్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని.. అప్పుడే బ్యాటింగ్లో సత్తా చూపగలడని ఆజాద్ పేర్కొన్నారు.
"రిషబ్ కీపర్ కంటే మంచి బ్యాట్స్మన్గా రాణించగలడని నేను భావిస్తున్నా. అది కేవలం తనను తాను ప్రశాంతంగా ఉంచుకోగలిగితేనే. వచ్చే ప్రతి బంతిని అతను బౌండరీ బాదాలనుకుంటాడు. టెస్టు, 50 ఓవర్ల మ్యాచ్లు ఆడేటప్పుడు టీ20లా అనుకోకూడదు. మైదానంలో నిలకడగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే అతను అద్భుతమైన ప్రదర్శన ఇవ్వగలడు. రిషబ్ గొప్ప ఆటగాడు. కానీ అతను తన ప్రతిభను వృథా చేసుకుంటున్నాడు."
-కీర్తి ఆజాద్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఇటీవలే మాజీ బ్యాట్స్మన్, ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. పంత్లో ఉన్న ఉత్తమ బ్యాటింగ్ లక్షణాన్ని భారత్ గుర్తించలేదని పేర్కొన్నాడు.