తొలిసారిగా నిర్వహిస్తున్న వన్డే ప్రపంచకప్ సూపర్ లీగ్ జులై 30 నుంచి ప్రారంభంకానున్నట్లు ఐసీసీ ప్రకటించింది. తొలి మ్యాచ్ సౌంథాప్టన్ వేదికగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య జరగనుంది. ఈ విషయాన్ని ఐసీసీ జనరల్ మేనెేజర్ జెఫ్ అల్లార్డైస్ స్పష్టం చేశారు.
ఐసీసీ శాశ్వత సభ్యదేశాలైన 12 జట్లతో పాటు 2015-17 టోర్నీ విజేతైన నెదర్లాండ్ ఈ సూపర్ లీగ్‌లో పాల్గొంటాయి. ప్రతి జట్టు స్వదేశంలో మూడు సిరీస్‌లు, విదేశాల్లో మూడు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది.
ఈ సూపర్ లీగ్ ద్వారా భారత్‌లో జరిగే 2023 ప్రపంచకప్ అర్హత నిర్ణయించనున్నారు. వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి 7 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన టీమ్‌ల అర్హత కోసం ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునట్లు తెలిపాడు ఇంగ్లాండ్ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్.