ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. 104 పరుగుల తేడాతో గెలుపొంది వరల్డ్‌కప్‌ను గొప్పగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లీష్ జట్టు బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ సత్తాచాటగా మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 312 పరుగుల లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 207 పరుగులకే ఆలౌటయింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధశతకాలతో సత్తాచాటారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బెయిర్ స్టో వికెట్ కోల్పోయినా.. రూట్, రాయ్ రాణించారు. రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు సాధించారు. రాయ్, రూట్ వెనువెంటనే పెవిలియన్ చేరగా మోర్గాన్, బెన్ స్టోక్స్ బాధ్యతాయుతంగా ఆడారు. వీరు కూడా హాఫ్ సెంచరీలతో మెరిశారు. ముఖ్యంగా స్టోక్స్ 79 బంతుల్లో 89 పరుగులతో పాటు రెండు వికెట్లను దక్కించుకుని ఆల్రౌండ్ ప్రతిభ కనబర్చాడు. వీరి ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది ఇంగ్లాండ్.
ప్రొటీస్ బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్ తాహిర్, రబాడ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 39.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటయింది. ప్రారంభంలోనే సఫారీ జట్టు ఓపెనర్ ఆమ్లా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి హెల్మెట్‌కు తాకగా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ డికాక్ (68) సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. ప్రొటీస్ జట్టులో మార్క్రామ్(11), డుప్లెసిస్ (5), డుమిని (8), ప్రిటోరియస్ (1) ఫెహ్లుక్వాయో (24) విఫలమయ్యారు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ఆమ్లా మిడిలార్డల్‌లో వచ్చి 24 పరుగులు చేసి వెనుదిరిగాడు.
జోఫ్రా అద్భుత అరంగేట్రం
ప్రపంచకప్‌లో తొలిసారి ఆడుతున్న ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 7 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ప్లంకెట్, బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీయగా.. రషీద్, మొయిన్ అలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇవీ చదవండి: