ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆట మెుదలైంది. కరోనా మహమ్మారితో నాలుగు నెలలుగా నిలిచిపోయిన క్రికెట్.. కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రతల మధ్య మళ్లీ ప్రారంభమైంది. అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసీసీ) కరోనా నిబంధనలకు లోబడి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ బుధవారం ఆరంభమైంది. 143 ఏళ్ల క్రికెట్ చరిత్రలో మైదానంలో అభిమానులు లేకుండానే ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు.
వరణుడి ఆధిపత్యం
కరోనాకు ఎదురునిలిచి దాదాపు 4 నెలల తర్వాత ప్రారంభమైన తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌పై వరుణుడు తొలిరోజు ప్రతాపం చూపాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. గాబ్రియల్ బౌలింగ్‌లో సిబ్లే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో 17 ఓవర్ల పాటు మాత్రమే మ్యాచ్ సాగగా.. బర్న్స్, డెన్లీ మరో వికెట్ పడకుండా 35 పరుగులు చేశారు. బర్న్స్ 55 బంతుల్లో 20 పరుగులు చేయగా.. డెన్లీ 48 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట నిలిచిపోయింది.
ఫ్లాయిడ్‌కు సంతాపం
ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు.. మ్యాచ్ ప్రారంభానికి ముందు అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి సంఘీభావం తెలిపారు. ఇరు జట్ల ఆటగాళ్లు మోకాళ్ల మీద కూర్చొని జార్జి ఫ్లాయిడ్ మృతికి శాంతి కలగాలని మౌనం పాటించారు.
ఇదీ చదవండి: మోకాళ్లపై కూర్చొని ఫ్లాయిడ్ మృతికి క్రికెటర్ల సంఘీభావం