సిరీస్ అయితే పోయినట్లే. ఇక తేలాల్సిందల్లా పాకిస్థాన్ 0-1తో ఓడుతుందా.. లేక 0-2తో పరాభవం చవిచూస్తుందా అన్నదే. మూడు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉన్న ఆ జట్టు.. మూడో టెస్టులో ఓటమి తప్పించుకునేందుకు పోరాడుతోంది. ఆ జట్టుకు నాలుగో రోజు వరుణుడు కూడా సహకారం అందించాడు. అయితే ఈ సహకారం చివరి రోజు కూడా అందాలన్నది ఆ జట్టు కోరిక. అలా అయితే తప్ప మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం కష్టమే. పూర్తి ఓవర్లు ఆడాల్సి వస్తే మాత్రం ఓటమి తప్పకపోవచ్చు.
గట్టెక్కించేందుకు ప్రయత్నాలు
తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఉచ్చులో చిక్కుకున్న పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో శనివారం ఆట ఆఖరుకు 100/2తో నిలిచింది. వర్షం, వెలుతురులేమి అంతరాయం కలిగించడం వల్ల రోజు మొత్తంలో 56 ఓవర్లే సాధ్యపడ్డాయి. పూర్తి ఆట జరిగితే పాక్‌కు కష్టమయ్యేది.
జట్టును డ్రాతో గట్టెక్కించాలని ఓపెనర్లు షాన్ మసూద్ (66 బంతుల్లో 18), అబిద్ అలీ (162 బంతుల్లో 42) పట్టుదల ప్రదర్శించారు. ఇద్దరూ కలిపి 38 ఓవర్లు కరిగించి పెవిలియన్ చేరారు. మసూద్‌ను బ్రాడ్ (1/23), అబిద్‌ను అండర్సన్ (1/18) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు.
పూర్తి ఓవర్లు ఆడితే ఓటమి ఖాయం
తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, కెప్టెన్ అజహర్ అలీ (92 బంతుల్లో 29 బ్యాటింగ్)కి తోడుగా స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ (16 బంతుల్లో 4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు వీళ్లిద్దరూ ఎంత సేపు క్రీజులో నిలుస్తారు? వర్షం ఏమేర పాక్‌కు సహకరిస్తుందన్న దాన్ని బట్టి మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
రెండు సెషన్ల ఆట సాధ్యపడినా ఇంగ్లాండ్ బౌలర్లు పాక్‌ను చుట్టేసే అవకాశముంది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి పాక్ రన్‌రేట్ 1.78 మాత్రమే కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ 583/8 వద్ద డిక్లేర్ చేసింది. తొలి టెస్టులో పాకిస్థాన్ సగానికి పైగా ఆటలో పైచేయి సాధించినప్పటికీ.. తర్వాత పుంజుకున్న ఇంగ్లాండ్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రెండో టెస్టు వర్షం వల్ల డ్రాగా ముగిసింది.