వచ్చే నెల నుంచి జరగనున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల కోసం టీమ్ఇండియా జట్టును మంగళవారం ప్రకటించనుంది. పితృత్వ సెలవుల్లో ఉన్న కోహ్లీ, తిరిగి రావడం లాంఛనమే. గాయంతో ఆసీస్‌తో సిరీస్‌కు దూరమైన ఇషాంత్ శర్మను కూడా ఎంపిక చేయనున్నారు. గాయాలతో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు దూరమైన బుమ్రా, అశ్విన్‌ల ఎంపికపై సెలెక్షన్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
షమి(మోచేతి గాయం), రవీంద్ర జడేజా(బొటనవేలు శస్త్రచికిత్స), ఉమేశ్ యాదవ్(కండరాల్లో చీలిక), హనుమ విహారి(గ్రేడ్ 2-కండరాల్లో చీలక) గాయాలతో బాధపడుతుండటం వల్ల సిరీస్ మొత్తానికి దూరం కానున్నారు.
జనవరి 27న ఆతిధ్య చెన్నైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లోకి భారత్, ఇంగ్లాండ్ జట్లు వెళ్లనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు ఆడనున్నాయి. ఇందుకోసం 16-18 మందితో కూడిన జట్టుతో పాటు పలువురు నెట్ బౌలర్లను చేతన్ శర్మ ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది.
బ్యాట్స్‌మెన్‌లో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఎవరో ఒకరు జట్టులో ఉండే అవకాశముంది. పృథ్వీ షాను తీసుకోకపోవచ్చు. పంత్, సాహాలను వికెట్ కీపర్లుగా ఎంపిక చేయనున్నారు. పేస్ విభాగాన్ని ఇషాంత్, బుమ్రా, సిరాజ్ ముందుండి నడిపించనున్నారు. శార్దుల్ ఠాకుర్, నటరాజన్ రిజర్వ్ బౌలర్లుగా ఉండనున్నారు. స్పిన్ విభాగంలో అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లను తీసుకునే అవకాశముంది. జడేజా బదులు నదీమ్‌ను ఎంపిక చేయొచ్చని సమాచారం.
జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్(రిజర్వ్), పుజారా, కోహ్లీ(కెప్టెన్), రహానె, సాహా, పంత్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, ఇషాంత్ శర్మ, శార్దుల్ ఠాకుర్, నటరాజన్, అశ్విన్, నదీమ్, కుల్దీప్ యాదవ్