దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి ఆ దేశ క్రికెటర్ డీన్ ఎల్గర్ ఆసక్తి వ్యక్తం చేశాడు. తనకు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని క్రికెట్ దక్షిణాఫ్రికాతో జరిగిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ పదవికి డుప్లెసిస్ ఫిబ్రవరిలో రాజీనామా చేశాడు. క్వింటన్ డికాక్‌ను ఆ స్థానానికి సారథిగా ఎంపిక చేస్తారని అనుకున్నా.. వికెట్ కీపర్‌గా తనకు మరింత ఒత్తిడి కలిగించడం ఇష్టం లేని కారణంగా అతడిని ఎంపిక చేయలేదని క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది. జులైలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని భావిస్తోంది సఫారీ క్రికెట్ బోర్డు.
"నా పాఠశాల స్థాయి నుంచి ప్రాంతీయ, ఫ్రాంచైజీ స్థాయి జట్లకు గతంలో నాయకత్వం వహించా. దాన్ని బాగా ఆస్వాదించా. ఒకవేళ నాకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగిస్తే కచ్చితంగా చాలా కాలంపాటు విధేయతతో నిర్వర్తిస్తా".
- ఎల్గర్, దక్షిణాఫ్రికా ఓపెనర్
శ్రీలంక వేదికగా 2006లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌నకు ఎల్గర్ నాయకత్వం వహించాడు. 2017లో ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ ఆడే క్రమంలో అప్పటి కెప్టెన్ డుప్లెసిస్‌కు మొదటి బిడ్డ పుట్టడం వల్ల ఓ మ్యాచ్ గైర్హాజరు అయ్యాడు.. దీంతో ఆ మ్యాచ్‌లో ఎల్గర్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు.
గతేడాది పాకిస్థాన్‌పై జరిగిన టెస్టు సిరీస్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ డుప్లెసిస్‌ను రెండు మ్యాచ్‌లకు సస్పెండ్ చేయడం వల్ల అనుహ్యంగా రెండోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు ఎల్గర్. ఇప్పటికే దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఉండటానికి మర్కరమ్, కేశవ్ మహరాజ్ ఆసక్తి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి... 'ఆయన చరిత్ర అందరికీ ఆదర్శం'