ఐపీఎల్-2020కి బాలారిష్టాలు తప్పడం లేదు. అనుకోని అవాంతరాలు వరుసగా ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్‌కింగ్స్ శిబిరంలో 13 మందికి కరోనా వైరస్ సోకడం కలకలం సృష్టించింది. అందులో పేసర్ దీపక్ చాహర్, యువ బ్యాట్స్‌మన్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఉండటం ఇబ్బందికరంగా మారింది. దాంతో పాటు చెన్నై బృందంలోని అధికారులు, సోషల్ మీడియా నిర్వాహక బృందాంలో కొందరికి వైరస్ సోకింది. అదే జట్టుకు కీలకమైన సురేశ్ రైనా మనస్తాపంతో భారత్ బాట పట్టాడు!. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు.
తాజాగా ఐపీఎల్‌కు సంబంధించి మరో కబురు అందింది. లీగ్‌కు అధికారిక ప్రసారదారైన స్టార్‌ఇండియా ప్రొడక్షన్ బృందంలో ఒకరికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని బీసీసీఐ-ఐపీఎల్ వర్గాల సమాచారం! దశల వారీగా యూఏఈకి బృందాలను పంపించాలని స్టార్ యాజమాన్యం నిర్ణయించిందట. అందులో మొదటి బృందం ఆగస్టు 31న దుబాయ్ విమానం ఎక్కాల్సింది. శనివారం వారికి హడావిడిగా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని తేలింది.
ఈ విషయం తెలియగానే సోమవారం ఎమిరేట్స్ విమానం ఎక్కాల్సిన బృందాన్ని స్టార్ ఆపేసింది. తదుపరి నిర్ణయం వెలువరించే వరకు ప్రయాణాన్ని వాయిదా వేయాలని ఆదేశించిందని తెలిసింది. అయినప్పటికీ వారు మళ్లీ యూఏఈకి వెళ్తే ఎక్కువ రోజులు క్వారంటైన్ ఉండాలట. టోర్నీ ఈ నెల 19 నుంచి ఆరంభం కానున్న నేపథ్యంలో.. ఇలా క్వారంటైన్‌లో ఉంటే సన్నాహకాలు కష్టమవుతాయి. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల స్టార్, బీసీసీఐ అనూహ్య నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని అంటున్నారు.