న్యూజిలాండ్‌తో పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ పరాజయం ముంగిట నిలిచింది. అయితే ఈ ప్రదర్శనపై పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఇతరులపై నిందలు వేసే ఆట ఆడమని, రెండో రోజు ప్రదర్శనలో ఎవరినీ ప్రత్యేకంగా నిందించమని అన్నాడు.
"ఇతర ఆటగాళ్లపై నిందలు వేసే ఆటను మేం ఎప్పటికీ ఆడము. ఈరోజు ప్రదర్శనలో ఎవరినీ నిందించట్లేదు. బౌలింగ్ విభాగం విఫలమైన సందర్భాల్లో బ్యాట్స్‌మెన్ ఎప్పుడైనా బౌలర్ల వైఫల్యం గురించి మాట్లాడారా? ప్రతికూల పరిస్థితుల్లో జట్టుగా మేం మంచి ప్రదర్శన చేయడానికే చూస్తాం. క్రీజులో ఇంకా ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఉన్నారు. రేపు ఆటలో రాణించడానికి ప్రయత్నిస్తాం. సాధ్యమైనన్ని పరుగులు సాధించి రేసులో నిలిచేందుకు కృషి చేస్తాం. అయితే రెండో రోజు ఆటలో ఊహించని విధంగా మేం వికెట్లను కోల్పోయాం. ఏదీ ఏమైనప్పటికీ జట్టుగా కలిసి పోరాడతాం"
-జస్ప్రీత్ బుమ్రా, టీమిండియా పేసర్
వికెట్ తీయకుండా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ముగించిన బుమ్రా.. తన ప్రదర్శనపై మాట్లాడాడు. ఎప్పుడూ వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టిసారించనని, ప్రత్యర్థులను ఒత్తిడికి గురిచేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు.
"నేను ఎప్పుడూ వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి పెట్టను. ఎలా బౌలింగ్ చేస్తున్నాననే అంశంపై ఆలోచిస్తా. ప్రత్యర్థులను ఒత్తిడికి గురిచేస్తా. కొన్ని రోజులు వికెట్లు సాధిస్తా, మరికొన్ని రోజులు ఇతరులు తీస్తారు. కానీ నా దృష్టంతా జట్టు కోసం నేనేం చేయగలననే ఉంటుంది. బౌలింగ్‌లో నేను ఆలోచించే ప్రణాళికలపై ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి. కానీ ఫలితాల గురించి ఆలోచించకండి"
-జస్ప్రీత్ బుమ్రా, టీమిండియా పేసర్
సమష్టిగా రాణించడం వల్లే కివీస్‌ను రెండో టెస్టులో భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశామని అన్నాడు బుమ్రా. న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. షమి 4, బుమ్రా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 7 పరుగుల స్వల్ప ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల కోల్పోయి 90 పరుగులు చేసింది.