హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అవినీతిలో కూరుకుపోయిందని తాను చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ను సీనియర్ ఆటగాడు అంబటి రాయుడు కోరాడు. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిపై దృష్టి పెట్టి దాన్ని నిర్మూలించాలని కేటీఆర్‌ను కోరినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు రాయుడు.
డబ్బుతో పాటు ఎన్నో ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న అవినీతి పరుల ప్రభావం పడ్డ జట్టుతో హైదరాబాద్ క్రికెట్ గొప్పగా ఎలా ఎదుగుతుందని ఇంతకుముందు ప్రశ్నించాడు రాయుడు. ఈ ట్వీట్‌పై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ స్పందిస్తూ, రాయుడు "అసహన క్రికెటర్" అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై రాయుడు ఆదివారం స్పందించాడు.
"హాయ్ అజహరుద్దీన్. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇది మనిద్దరి కన్నా పెద్దది. హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో మనిద్దరికీ తెలుసు. కుట్రలకు దూరంగా ఉంటూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని బలంగా నమ్ముతున్నా. హైదరాబాద్ క్రికెట్‌ను ప్రక్షాళన చేసే అవకాశం మీకుంది. భవిష్యత్ క్రికెటర్లను కాపాడతారని ఆశిస్తున్నా."
-అంబటి రాయుడు, సీనియర్ ఆటగాడు
హెచ్‌సీఏలో రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్న రాయుడు జట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఎంతకాలం ఉంటాడన్నది స్పష్టత ఇవ్వలేదు.
"ఈ సీజన్‌లో హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడాలనుకున్నా. దురదృష్టవశాత్తూ అలా జరగట్లేదు. జట్టులో రాజకీయాల కారణంగా ఆటను ఆస్వాదించే పరిణామాలు కనిపించడం లేదు. ప్రస్తుత జట్టుతో అసౌకర్యంగా ఉన్నా. ఈ విషయమై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో మాట్లాడినా ఫలితం లేదు. అర్హత లేని ఆటగాళ్లు చాలామంది జట్టులో చేరుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే జట్టు ప్రదర్శన ఎలా మెరుగవుతుంది."
-అంబటి రాయుడు, సీనియర్ ఆటగాడు
ఇదీ చూడండి:చిన్న రైతులు పెద్ద భరోసా...