టీమిడింయా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుస రికార్డులతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా టీ-20 ఫార్మాట్లో నువ్వా - నేనా అనేలా కొనసాగుతుంది వీరి ప్రదర్శన. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో విరాట్ - రోహిత్ రికార్డులు ఇప్పుడు చూద్దాం!
టీ 20ల్లో అత్యధిక పరుగుల వీరులు..
అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. 88 ఇన్నింగ్స్‌ల్లో 2,422 పరుగులు చేశాడు. 65 ఇన్నింగ్స్‌ల్లో 2,369 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు కోహ్లీ. వీరిద్దరి మధ్య అంతరం 53 పరుగులే. సఫారీలతో జరగనున్న టీ-20ల్లో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశముంది. మార్టిన్ గప్తిల్ 2,283 పరుగులు, షోయబ్ మాలిక్ 2,263 పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
శతకం కోసం వేట..
టీ-20ల్లో నాలుగు శతకాలు, 17 అర్ధశతకాలతో ముందు వరుసలో ఉన్నాడు రోహిత్. 21 అర్ధసెంచరీలు చేసిన కోహ్లీ మాత్రం శతకం అందుకోలేకపోయాడు. వన్డే, టెస్టు క్రికెట్లో వంద మైలురాయి సాధించిన విరాట్ పొట్టి ఫార్మాట్లో సెంచరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.
స్వదేశంలో ప్రొటీస్‌పై ప్రతీకారం...
సొంత గడ్డపై ఒకే ఒక్క సారి దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్‌తో తలపడింది టీమిండియా. 2015లో జరిగిన ఆ సిరీస్‌లో ప్రొటీస్ 2-0 తేడాతో నెగ్గింది. అప్పటి పరాభవానికి ప్రతీకారం ఇప్పుడు తీర్చుకోవాలనుకుంటోంది కోహ్లీ సేన. 2008 నుంచి ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన టీ-20 సిరీస్‌లు చూసుకుంటే 13-8 తేడాతో భారత్ ముందంజలో ఉంది.
ఫామ్‌పై ఇరు ఆటగాళ్ల దృష్టి..
మయాంక్ అగర్వాల్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోని హిట్ మ్యాన్ సఫారీలపై టీ 20ల్లో సత్తాచాటి తనేంటో చూపించు కోవాలనుకుంటున్నాడు. విండీస్‌పై పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమైన కోహ్లీ ఇందులో భారీ స్కోర్లు చేయాలని ఆశిస్తున్నాడు.
ఈ నెల 15 నుంచి 22 వరకు దక్షిణాఫ్రికాతో మూడు టీ-20లు ఆడనుంది టీమిండియా. తొలి మ్యాచ్ ధర్మశాల వేదిక కాగా.. రెండు, మూడు మ్యాచ్‌లు.. మొహాలీ, బెంగళూరుల్లో జరుగనున్నాయి.
ఇదీ చదవండి: వైరల్: ధోనీ వీడ్కోలుపై సీఎస్కే ట్వీట్