టీ20 ప్రపంచకప్ జట్టులో ధోనీ స్థానంపై అనుమానం వ్యక్తం చేశారు టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు శ్రీకాంత్, గంభీర్. ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే తను జట్టులోకి రావటానికి అవకాశాలు పూర్తిగా మందగిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించక పోతే ధోనీ జట్టులోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి . సూటిగా చెప్పాలంటే కేఎల్ రాహుల్ అటు బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. రిషబ్ పంత్‌ను కొంతమేర పరిశీలించాల్సి ఉన్నా.. అతడూ ఉత్తమ ప్రదర్శన చేయగలడు. ధోనీని జట్టులోకి తీసుకోవద్దనే ఆలోచన నాలో లేదు కానీ, అతడి ఎంపిక ఐపీఎల్ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. నేను భారత జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయితే ఏం జరిగి ఉండేదో చెప్తున్నా. అంతే తప్ప దీనిపై నేను ఎలాంటి రాయబారాలు చేయటం లేదు."
-శ్రీకాంత్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఈ విషయంపై తాజాగా మాజీ క్రికెటర్, దిల్లీ లోక్‌సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. ఐపీఎల్ రద్దయితే ప్రపంచకప్ తుది జట్టులో ధోనీ స్థానం అనుమానమే అని అన్నాడు. అయితే టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. ఏది ఏమైనా మరి కొంతకాలం ధోనీ ఆటలో నిలకడగా రాణిస్తాడని.. విరామం వచ్చినా తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌ను కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించలేదు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా మహీ జట్టులోకి వస్తాడని ఇటీవలే టీమ్ఇండియా ప్రధానకోచ్ రవిశాస్త్రి తెలిపాడు.
ఇదీ చూడండి.. విరామం వచ్చినా బంతిని బాదడంలో మార్పులేదు!