టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలను ఐపీఎల్ అత్యుత్తమ సారథులుగా ప్రకటించింది స్టార్‌స్పోర్ట్స్ నిపుణుల జ్యూరీ. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 11 సీజన్లలో 10 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, మూడు సార్లు విజేతగా నిలిచింది. ముంబయి ఇండియన్స్‌కు 2013 నుంచి సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోహిత్.. ఆ జట్టును నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఆల్‌టైమ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్, బౌలర్‌గా శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఎంపికయ్యారు.
ప్రస్తుతం చెన్నైకు ఆడుతున్న ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, కివీస్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉత్తమ కోచ్‌గా ఎంపికయ్యారు. ఐపీఎల్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇతడు ప్రస్తుతం 5412 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ జాబితాను 50 మందితో కూడిన స్టార్‌స్పోర్ట్స్ నిపుణుల జ్యూరీ ఎంపిక చేసింది. ఇందులో 20 మంది మాజీ క్రికెటర్లు, 10 మంది సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టులు, 10 మంది విశ్లేషకులు, 10 మంది గణాంకాల నిపుణులు ఉన్నారు.
కరోనా వైరస్ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ.
ఇదీ చూడండి : బంగాల్ రంజీ క్రికెటర్లకు లక్ష్మణ్ ఆన్లైన్ శిక్షణ!