తాను ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్, కెప్టెన్ సౌరభ్ గంగూలీ. 2008లో నాగ్‌పుర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో గంగూలీ భుజంపై ధోనీ చేయి వేసిన సంఘటన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఆ మ్యాచ్‌లో కంగారూ జట్టుపై 172 పరుగులు తేడాతో నెగ్గింది భారత్. ఈ మ్యాచ్‌లో మూడు-నాలుగు ఓవర్ల తర్వాత జట్టు పగ్గాలను ధోనీకి అప్పగించాడు దాదా.
2000-2005 మధ్య 49 టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన గంగూలీ.. చివరి మ్యాచ్‌లో ధోనీ చేసిన పనికి ఆశ్చర్యపోయానని తాజాగా వెల్లడించాడు.

"క్రికెటర్‌గా చివరి టెస్టు నాగ్‌పుర్‌లో ఆడాను. అదే నా అంతర్జాతీయ కెరీర్లో చివరి రోజు. అదే చివరి సెషన్ కూడా. విదర్భ స్డేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ నుంచి మెట్లు దిగి నేను నడుచుకుంటూ వస్తున్నాను. నా తోటి ఆటగాళ్లంతా దారిలో పక్కన నిల్చొని నాకు సాదర స్వాగతం పలికారు. ఆ మ్యాచ్‌లో నాయకత్వ బాధ్యతను వేరొకరి చేతికి అప్పగించా. ధోనీ అతని కెప్టెన్సీలాగే.. అతను నా భుజంపై చేయి వేసి ఆశ్చర్యానికి గురిచేశాడు".
- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
గంగూలీ.. తన కెరీర్లో మొత్తం 113 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి.. 7212 పరుగులు చేశాడు. 2008లో నాగ్‌పుర్ వేదికగా జరిగిన టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.