టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై స్పందించాడు సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్. గతేడాది వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా ఓటమి తర్వాత ఆటకు దూరమైన ధోనీ.. తన భవితవ్యంపై చాలా స్పష్టంగా ఉన్నాడని, ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. తాజాగా పదవి నుంచి తప్పుకున్నాక ఈ వ్యాఖ్యలు చేశాడు ఎమ్మెస్కే.
"ధోనీ భవిష్యత్‌పై స్పష్టతతో ఉన్నాడు. ఆ విషయాన్ని నాతో పాటు జట్టు యాజమాన్యంతోనూ పంచుకున్నాడు. దాన్ని గోప్యంగా ఉంచాలి కనుక చెప్పలేకపోతున్నా. మా మధ్య జరిగిన సంభాషణ చాలా బాగా జరిగింది. అది మా మధ్యే ఉండిపోతుంది"
-ఎమ్మెస్కే, సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్.
విలువైన క్రికెటర్లు వెలుగులోకి
తన పదవీకాలంలో టీమిండియాకు విలువైన క్రికెటర్లను అందించానని.. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రిషభ్‌పంత్ వంటి యువకులు వెలుగులోకి వచ్చారని చెప్పాడు ఎమ్మెస్కే. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను వివరించాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పించడం తనకు సవాలుగా మారిందని, అలాగే ధోనీకి తగ్గ నాయకుడిని భర్తీ చేయడం కూడా కష్టంగా అనిపించిందని తెలిపాడు.
ఇదీ చూడండి : రంజీ ఫైనల్లో జడేజా ఆడకపోవడానికి కారణం గంగూలీనా?