న్యూలాండ్స్ స్టేడియం. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కేంద్ర బిందువులుగా క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ కుంభకోణం జరిగింది ఇక్కడే. ఈ ఆటగాళ్లు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తిరిగి న్యూలాండ్స్ మైదానంలో అడుగుపెట్టనున్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం అక్కడే జరగనుంది.
2018 మార్చి 24న దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఓ సాండ్‌పేపర్‌ను దాస్తూ టీవీలో దొరికిపోయాడు. అప్పుడు ఆసీస్‌కు స్మిత్ కెప్టెన్.. వార్నర్ వైస్‌కెప్టెన్. అదే రోజు సాయంత్రం విలేకర్ల సమావేశంలో.. సాండ్‌పేపర్ సహాయంతో బాల్ టాంపరింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు బాన్‌క్రాఫ్ట్, స్మిత్ అంగీకరించారు. అందుకు వార్నరే సూత్రధారి అనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రికెటర్ల చర్యను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి సహా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది మంది ఖండించారు. ఘటనపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా.. స్మిత్, వార్నర్‌లపై ఏడాది.. బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. వార్నర్ ఎప్పటికీ ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించలేడని చెప్పింది. ప్రస్తుత పర్యటనలో వార్నర్, స్మిత్‌లు జొహానెస్‌బర్గ్, పోర్ట్ ఎలిజబెత్‌లో ఆడారు. ప్రేక్షకుల నుంచి వారికి పెద్దగా దూషణలుగా ఎదురుకాలేదు. న్యూలాండ్స్‌లోనూ వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని స్టేడియం మేనేజర్ క్లిఫోర్డ్ చెప్పాడు. ఎవరైనా ఏ ఆటగాణ్నైనా దూషిస్తే సహించమని అతడు తెలిపాడు. దురుసుగా ప్రవర్తించిన వాళ్లను మైదానం నుంచి పంపిస్తామని చెప్పాడు.
ఇదీ చూడండి.. రెండో టెస్టులో గెలిస్తే.. భారత్ ఖాతాలో అరుదైన రికార్డు