యువ క్రికెటర్లకు.. డోపింగ్, అవినీతి అంశాలతో పాటు జాతి వివక్షపై గురించి అవగాహన పెంచాలని ఐసీసీకి సూచించాడు వెస్టిండీస్ మాజీ సారథి డారెన్ సామి. యువ క్రికెటర్లు దీని గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నాడు. తద్వారా క్రికెట్లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఆలోచనా ధోరణి, తోటి క్రికెటర్లకు అలవాటవుతుందని చెప్పుకొచ్చాడు. ఐసీసీ నిర్వహించిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.
"యువక్రికెటర్లకు డోపింగ్, అవినీతి అంశాలతో పాటు జాతివివక్ష గురించి అవగాహన పెంచాలి. ఎందుకంటే క్రికెట్లో భిన్నవర్గాలు, ప్రాంతాలు, నేపథ్యాలకు చెందిన వారు వస్తుంటారు. కాబట్టి ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఫలితంగా ప్రతిఒక్కరిని సమానంగా చూసే వ్యక్తిత్వం ఆటగాళ్లలో అలవడుతుంది"
-డారెన్ సామి, వెస్టిండీస్ మాజీ సారథి
ఇటీవలే మాట్లాడిన సామి.. తాను ఐపీఎల్ ఆడినప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోని కొందరు క్రికెటర్లు, తనపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారని చెప్పాడు. తర్వాత ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది.
ఐసీసీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషాన్ గుహా(ఇంగ్లాండ్), జేపీ డుమిని(అఫ్రికా), టామ్ మూడీ(ఆస్ట్రేలియా), బజీద్ ఖాన్(పాకిస్థాన్)లు సామి వ్యాఖ్యలను సమర్థించారు.
ఇది చూడండి : 'ఐపీఎల్లో నాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు'