ప్రపంచకప్ సెమీస్ తర్వాత క్రికెట్ నుంచి విరామం తీసుకున్న టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ... ఆ తర్వాత గోల్ఫ్, టెన్నిస్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్వంటి క్రీడలు ఆడుతూ కనిపించాడు. తాజాగా అభిమానులకు మహీ మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే తొలి డే/నైట్ టెస్టులో క్రికెట్ వ్యాఖ్యాతగా మహీ సందడి చేస్తాడని తెలుస్తోంది.
![cricket match broadcaster Star Sports plans for MS Dhoni to commentator during day-night Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4903467_eden-gardens.jpg)
ఎప్పుడో వీడ్కోలు...
2014లో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత మిస్టర్ కూల్ టెస్టులకు వీడ్కోలు ప్రకటించాడు. ఆ తర్వాత ఒక్కసారీ సుదీర్ఘ ఫార్మాట్ జరిగేటప్పుడు మైదానంలో అడుగు పెట్టలేదు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 22న భారత్ చారిత్రక డే/నైట్ టెస్టు ఆడబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ ఇండియా ఓ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
![cricket match broadcaster Star Sports plans for MS Dhoni to commentator during day-night Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4969910_dhonitest_jersey_vamsi.jpg)
ఇందులో భాగంగా భారత్‌కు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన సారథులను తొలి రెండు రోజులు ఆహ్వానిస్తారు. విరాట్ కోహ్లీ సహా టీమిండియా మాజీ సారథులు, జట్టు సభ్యులు, బీసీసీఐ పెద్దలు జాతీయ గీతం ఆలపిస్తారు. రోజంతా కెప్టెన్లు కామెంటరీ బాక్స్‌లో కనిపిస్తారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తమకు ఇష్టమైన సంఘటనల గురించి మాట్లాడతారు.
అదిరిపోయేలా అలరిస్తారా...!
మూడో రోజు మధ్యాహ్నం... 2001లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయాన్ని టీవీలో ప్రదర్శిస్తారు. అంతేకాకుండా నాలుగో రోజు తర్వాత నుంచి విరామ సమయంలో సారథులంతా క్రికెట్ ఆడతారు. వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ గురించి మైదానంలోని తెరలపై ప్రసారం చేస్తారు. ఈ ప్రణాళికను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆమోదించాల్సి ఉందని సమాచారం.
చారిత్రక గులాబీ బంతి టెస్టుకు ముందు ఆటగాళ్ల సాధనను టీవీల్లో ప్రసారం చేయాలని స్టార్ భావిస్తోంది. అభిమానులు మైదానాలకు చేరుకొని ఉచితంగా వారి సాధనను తిలకించవచ్చు. తమ అభిమాన ఆటగాళ్లతో మాట్లాడే అవకాశమూ కల్పించనుంది.