ఆస్ట్రేలియా క్రికెటర్లకు కరోనా అంటే భయం లేనట్టుంది. అందుకే కరచాలనం కొనసాగిస్తామని అంటున్నారు. తమ వద్ద శానిటైజర్స్ కావల్సినన్ని ఉన్నాయని.. షేక్ హ్యాండ్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఆసీస్ కోచ్ లాంగర్ తెలిపాడు. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా మాట్లాడాడు లాంగర్.
"డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు ఆటగాళ్ల మధ్య పలకరింపులో ఎలాంటి తేడా ఉండదు. కరచాలనం కొనసాగిస్తాం. ఆటగాళ్ల వద్ద సరిపడా శానిటైజర్లు ఉన్నాయి."
-జస్టిన్ లాంగర్, ఆసీస్ కోచ్
అయితే ఇంగ్లాండ్ మాత్రం కరచాలనానికి స్వస్తి చెప్పింది. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉంటామని.. అందుకే కరచాలనానికి బదులు ఫిస్ట్ బంప్‌ను కొనసాగిస్తామని తెలిపింది.