ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కొవిడ్-19 (కరోనా వైరస్).. క్రీడారంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఆ వైరస్ భయంతో ఇప్పటికే కొన్ని టోర్నీలు రద్దవగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. ఇంకొన్ని టోర్నీల్లో మ్యాచ్‌లు కొనసాగుతున్నా.. చూసేందుకు ప్రేక్షకులను అనుమతించట్లేదు. ఇటలీ ఫుట్‌బాల్ లీగ్‌లో రొనాల్డో మ్యాచ్‌కు స్టేడియం ఖాళీగా దర్శనమిచ్చిన సంగతి మరవకముందే.. ప్రతిష్ఠాత్మక ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని తలుపులు మూసేసి నిర్వహిస్తామని బాయ్ ప్రకటించింది. ఇండోర్ స్టేడియంలో ఆడే మ్యాచ్‌లకే ప్రేక్షకులను అనుమతించకపోతే.. ఇక బయట మైదానాల్లో ఆడే ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం టికెట్ల విక్రయాలను నిషేధించింది. కర్ణాటక అదే దారిలో వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ సజావుగా సాగడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
దిల్లీ
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ అనుకున్న ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ.. బయట పరిణామాలు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ను మహారాష్ట్రలో నిర్వహించకూడదని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే కోరింది. ఓ అడుగు ముందుకేసి ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై నిషేధం విధించింది. ఈ నెల 29న ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సీజన్ ఆరంభ మ్యాచ్ ముంబయిలోనే జరగాల్సి ఉంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులను స్టేడియాలకు రాకుండా చేసి కేవలం టీవీల్లోనే మ్యాచ్ చూసే వీలు కల్పించే విషయంపైనా చర్చ నడుస్తోంది.
మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తాజాగా మాట్లాడుతూ.. "ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్‌ను వాయిదా వేయడమో లేదా మ్యాచ్‌లను టీవీల్లో చూసేలా అభిమానులను పరిమితం చేయడమో చేయాలి. ప్రభుత్వం ముందు ఈ రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి" అని అన్నారు.
మరోవైపు బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించొచ్చా? లేదా? తెలపాలంటూ కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బాటలోనే కర్ణాటక వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే వేదికలున్న అన్ని రాష్ట్రాలు ఇదే పద్ధతి అనుసరిస్తే ఇక సీజన్ జరగనట్లే.
ప్రేక్షకులు లేకుండానే: ఇండియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రేక్షకుల్లేకుండానే జరగనుంది. వైరస్ ప్రభావం కారణంగా ఈ నెల 14 నుంచి దిల్లీలో ఆరంభమయ్యే ఈ టోర్నీ మ్యాచ్‌లకు అభిమానులను అనుమతించబోమని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) బుధవారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌కు కీలకమైన ఈ టోర్నీని పూర్తి జాగ్రత్తల మధ్య నిర్వహించనున్నారు. ఈ నెల 19న ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ వాయిదా పడింది.
మరోవైపు ఇంగ్లాండ్‌లో ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా మాంచెస్టర్ సిటీ, అర్సెనల్ మధ్య మ్యాచ్‌నూ వాయిదా వేశారు. బెంగళూరులోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) దక్షిణ కేంద్రాన్ని మూసేశారు.
సెల్ఫీలు వద్దు..: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. బయట హోటళ్లలో భోజనం చేయొద్దని, అభిమానులతో సెల్ఫీలకు దూరంగా ఉండాలని చెప్పింది. కరచాలనాలు ఇవ్వడం, ఇతరుల ఫోన్లు తాకడం మానేయాలని సూచించింది. మరోవైపు వన్డేకు వైరస్ దెబ్బ పడింది. మంగళవారం నాటికి మొత్తం 22 వేల టికెట్ల గాను 16 వేల టికెట్లే అమ్ముడుపోయాయి. మైదానం నిండడం అనుమానంగానే మారింది.
ఒలింపిక్స్‌పై నిర్ణయం ఐఓసీదే: టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం లేదా రద్దుచేయడం అనూహ్యమైన విషయమేనని జపాన్ ఒలింపిక్ మంత్రి సీకో హషిమోటో అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓఏ) తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె పార్లమెంట్ కమిటీకి చెప్పారు. అయితే ఒలింపిక్స్ అనుకున్న ప్రకారమే జరుగుతాయని, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ గతంలో స్పష్టం చేశారు.