ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ నిర్వహణపై అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో లీగ్ రద్దవతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు లేకుండానే టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
శనివారం జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో టోర్నీ నిర్వహణపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మార్చి 29న ఐపీఎల్ 2020 ఆరంభం కానుంది. ఈ టోర్నీకి వీక్షకులను అనుమతించొద్దని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచనలిచ్చింది. వాటిని పాటించాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆయా బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది.
"దేశంలో ఏ క్రీడా పోటీల కోసమైనా భారీ జన సమూహాలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ పోటీలను వాయిదా లేదా రద్దు చేసే పరిస్థితులు లేకుంటే ఖాళీ స్టేడియాల్లో టోర్నీలు నిర్వహించాలి. అభిమానులను మాత్రం అనుమతించొద్దు. బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలు.. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు పాటించాలని మేం కోరాం".
- రాధేశ్యామ్ జులానియా, క్రీడా మంత్రిత్వశాఖ కార్యదర్శి
ఐపీఎల్ వాయిదా వేయడం లేదా రద్దు చేయడం కన్నా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించడమే మంచిదని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్టు సమాచారం. అభిమానులకు విక్రయించే టికెట్ల ఆదాయంలో వారికి వాటా ఉంటుంది. ఐతే ఖాళీ స్టేడియాల్లో టోర్నీ నిర్వహిస్తే నష్టం తగ్గే అవకాశముంది. ఈ నష్టాలను భర్తీ చేసుకొనేందుకు బీమా సైతం ఉంటుంది. కానీ టోర్నీ పూర్తిగా రద్దయినా, వాయిదా వేసినా వచ్చే నష్టాలు భరించడం కష్టమని యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి.. ఒలింపిక్ 'జ్యోతి' వెలిగింది.. ర్యాలీపై అనుమానం