ఆట లేదు.. ఆదాయం లేదు. ఐపీఎల్‌లో ఆయా జట్లతో ఒప్పందం కుదుర్చుకున్న క్రికెటర్ల ప్రస్తుత పరిస్థితి ఇది. కాసుల వర్షంలో తడుస్తామనుకున్న స్టార్ క్రికెటర్లు, జీవితమే మారిపోతుందనుకున్న దేశవాళీ ఆటగాళ్ల ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లింది. ఏప్రిల్ 15 తర్వాత కూడా ఐపీఎల్ జరిగే అవకాశాలు లేకపోవడం వల్ల కోట్లు, లక్షల రూపాయలకు అమ్ముడైన క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
'ఐపీఎల్‌లో ఆటగాళ్ల చెల్లింపులపై బీసీసీఐ నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. లీగ్ ప్రారంభానికి వారం రోజుల ముందు 15 శాతం ఆటగాళ్లకు చెల్లించాలి. టోర్నీ మధ్యలో 65 శాతం డబ్బులు ఇవ్వాలి. లీగ్ ముగిశాక నిర్ణీత వ్యవధిలోపు మిగతా 20 శాతం డబ్బులు చెల్లించాలి. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆటగాడికి ఫ్రాంచైజీలు డబ్బులు ఇవ్వలేదు. కరోనా మహమ్మారి ఇన్సురెన్స్ కిందకు రాదు కాబట్టి ఫ్రాంచైజీలకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్లకు రూ.75 కోట్ల నుంచి రూ.85 కోట్లు వరకు జీతాలు ఇస్తాయి. ఆటనే లేనప్పుడు జీతాలు ఎలా చెల్లిస్తాం? ధోని, కోహ్లి సహా ఐపీఎల్‌లో తొలిసారి ఆడనున్న చాలామంది యువ ఆటగాళ్లపై ఈ ప్రభావం ఉంటుంది. ఎంతో కష్టపడి ఐపీఎల్ జట్లలో చోటు సంపాదించిన వర్ధమాన క్రికెటర్లకు రూ.20 లక్షలు, రూ.40 లక్షలు, రూ.60 లక్షలు చాలా పెద్ద మొత్తాలే. ఆ డబ్బుతో వారి జీవితాలే మారిపోతాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి’’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపాడు.
ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐ సుమారు రూ.3000 కోట్లు నష్టపోతుందని అంచనా. ‘‘బీసీసీఐకి ఐపీఎల్ అతిపెద్ద టోర్నీ. వేతనాల కోతపై ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నష్టాల లెక్కలు వేయడం సాధ్యంకాదు. బోర్డు కార్యవర్గ సభ్యులు కలిసేంత వరకు ఏమీ చెప్పలేం’’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ తెలిపాడు. ‘‘క్రికెట్ ద్వారానే బీసీసీఐకి ఆదాయం వస్తుంది. ఆటే లేనప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లపైనా ఈ ప్రభావం ఉంటుంది. ఇది బోర్డు తప్పు కాదు. అనివార్యమైన పరిస్థితి' అని భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా అన్నాడు.