టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్.. ధోనీ గురించి తాజాగా మాట్లాడాడు. కీపర్లుగా రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నా, అనుభవజ్ఞుడైన ధోనీ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోందని అన్నాడు.
"మహీ భాయ్ చాలా అనుభవం ఉన్న ఆటగాడు. అతడు జట్టు కోసం ఎంతో చేశాడు. అతడిలాంటి క్రికెటర్.. జట్టులో లేకపోతే కచ్చితంగా మిస్ అవుతాం. యువ కీపర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్.. వికెట్ల వెనుక బాగా ఆడుతున్నారు. కానీ ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది"
-- కుల్దీప్యాదవ్, టీమిండియా బౌలర్
ఐపీఎల్‌పైనే ఆశలన్నీ
కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కుల్దీప్... త్వరలో జరగబోయే ఐపీఎల్‌లో సత్తా చాటాలనుకుంటున్నాడు. ఫలితంగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించుకోవాలని భావిస్తున్నాడు.
"ఐపీఎల్‌లో పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఆటగాళ్లు చురుకుదనంతో ఉండాలి. ఇప్పుడు నేను ఈ మెగా ఈవెంట్ కోసం సిద్ధంగా ఉన్నా. ఈసారి నా ప్రణాళికలకు తగినంత సమయం దొరికింది. టీ20 ప్రపంచకప్‌లో చోటు సంపాదించాలంటే ఐపీఎల్ చాలా ముఖ్యం. ప్రతి ఆటగాడు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకుంటాడు. ఎంత ఎక్కువ ఆడితే అంత మెరుగవుతారు. నెలన్నర పాటు నిర్విరామంగా ఆడే వేదిక ఐపీఎల్. అక్కడి ప్రదర్శనలే ఆటగాళ్లకు ప్రతిఫలాన్నిస్తాయి. క్రికెట్ అనేది ఒక్క రోజు ఆడే ఆట కాదు. ప్రతి ఒక్క ప్లేయర్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటాడు. ఏ క్రికెటర్‌కైనా మంచితో పాటు చెడ్డ రోజులు ఎదురవుతాయి. అలాంటప్పుడే ఆటగాళ్లు తిరిగి పుంజుకోవాలి"
-- కుల్దీప్యాదవ్, టీమిండియా బౌలర్
ఇటీవల వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కుల్దీప్.. జడేజాపైనా ప్రశంసలు కురిపించాడు. జడ్డూ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో బాగా రాణిస్తున్నాడని అన్నాడు. ఇతడి రాకతో జట్టులో పోటీతత్వం పెరిగిందని చెప్పాడు. అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతడితో కలిసి ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు.