విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న భారత క్రికెటర్ మహమ్మద్ షమీ భార్య హాసిన్ జహాన్‌కు.. భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది కోల్‌కతా హైకోర్టు. బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఆమెకు రక్షణ ఏర్పాటు చేయాలని తెలిపింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం సందర్భంగా ఆగస్టు 5వ తేదీన 'రామమందిరం భూమిపూజ సందర్భంగా హిందువులందరికీ శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు హాసిన్. ఈ క్రమంలోనే అత్యాచారం చేసి చంపేస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో హాసిన్ పోలీసులను ఆశ్రయించారు.
హాసిన్ జహాన్ కేసును ఉన్నత న్యాయస్థానం బుధవారం పరిశీలించింది. ఆమె తరఫు న్యాయవాది ఆశిష్ చక్రవర్తి సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపు సందేశాలను కోర్టు ముందుంచారు. కేసు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది అమిత్ బెనర్జీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌కు ఎలాంటి ప్రాణహాని కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.