ఏటా ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించాలని చూస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా, నాలుగు మెగా జట్లతో ఓ సిరీస్ నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇదివరకే ఈ విషయంపై ఓ ప్రతిపాదన చేయగా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డూ.. అదొక సృజనాత్మక ఆలోచన అని పేర్కొంది.
"సౌరభ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడయ్యాక తీసుకున్న నిర్ణయాల్లో ఇదొక సృజనాత్మక ఆలోచన. తక్కువ సమయంలోనే డే అండ్ నైట్ టెస్టు నిర్వహించి మంచి ఫలితాన్ని సాధించాడు. ఇప్పుడీ సూపర్ సిరీస్ గొప్ప ఆలోచన. వచ్చే ఏడాది నేను.. భారత్, బంగ్లాదేశ్ పర్యటనకొస్తాను. ఈ రెండు దేశాలతో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్‌తోనూ భవిష్యత్ కార్యచరణ గురించి చర్చలు జరపాల్సి ఉంది"
-కెవిన్ రాబర్ట్స్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ
క్రికెట్లో లీడర్‌గా ఉన్న ఆస్ట్రేలియా.. మిగతా దేశాలన్నింటికి సహకారం అందిస్తుందని చెప్పిన కెవిన్.. మిగతా దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడతామని స్పష్టం చేశారు.
"వచ్చే ఏడాది అఫ్గానిస్థాన్‌కు అతిథ్యం ఇవ్వబోతున్నాం. ఇది క్రికెట్ పట్ల మాకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రపంచ క్రికెట్‌ను అభివృద్ధి పథంలో నడపడానికి ఐసీసీలోని మిగతా దేశాలన్నింటితో సంప్రదింపులు జరుపుతున్నాం. ఉపఖండంలో క్రికెట్ ఓ మతంలాంటిది"
-కెవిన్ రాబర్ట్స్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ
ఈ మెగాటోర్నీలో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు మరో అగ్ర జట్టు పాల్గొనే అవకాశముంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. 2021 నుంచి మూడు పెద్ద జట్లు రొటేషనల్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తాయి. తద్వారా ఆయా క్రికెట్ బోర్డులు ఆర్థికంగా లాభపడే అవకాశముంది. ఐసీసీ.. మూడు దేశాలకు మించి టోర్నీలు నిర్వహించడానికి అనుమతించదు.
ఇవీ చూడండి.. నికోలస్ స్టన్నింగ్ క్యాచ్.. స్మిత్ పెవిలియన్‌కు