90ల్లో ఆస్ట్రేలియా ఊపు అలా ఇలా ఉండేది కాదు.. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఆ జట్టును ఎదుర్కొని గెలవడం ఏ జట్టుకైనా చాలా కష్టమయ్యేది. అలాంటిది ప్రాభవం కోల్పోయిన విండీస్‌కు గెలుపు సాధ్యమా! కానీ ఒక్కడి వల్ల కంగారూ జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. 1999లో బ్రిడ్జిటౌన్‌లో రసవత్తరంగా జరిగిన మూడో టెస్టులో కరీబియన్ సూపర్‌స్టార్ బ్రయాన్ లారా అసమాన పోరాటంతో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్‌లో లారా శతకం (153 నాటౌట్) ఆల్‌టైమ్ గ్రేట్ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి.
బ్రయాన్ క్లాసిక్ బ్యాటింగ్ ముందు స్టీవ్‌వా జిత్తులు పని చేయలేదు.. మెక్‌గ్రాత్ స్వింగ్ సరిపోలేదు.. వార్న్ అలసిపోయాడు.. మెక్‌గిల్ తేలిపోయాడు..! ఫలితం విండీస్ సంచలన విజయం! మ్యాచ్‌లో ఎక్కువశాతం ఆసీస్‌దే ఆధిపత్యం.. స్టీవ్ వా (199) భారీ శతకానికి తోడు పాంటింగ్ (104) కూడా సెంచరీ సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 490 పరుగులు చేసిన కంగారూ జట్టు.. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు పరిమితం చేసింది. అయితే వాల్ష్ (5/39) విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 146 పరుగులకే కుప్పకూలింది.
అసమాన పోరాటం
పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై 308 పరుగుల లక్ష్యంతో దిగిన కరీబియన్ జట్టు ఒక దశలో 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో విండీస్‌కు పరాభవం తప్పదనిపించింది. కానీ లారా పట్టు వదల్లేదు. జిమ్మీ ఆడమ్స్ (38)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించిన బ్రయాన్.. కుదురుకున్నాక కంగారూ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఆరో వికెట్‌కు 133 పరుగులు జత చేశాడు. ఒక దశలో విండీస్ 238/5తో మెరుగైన స్థితిలోనే ఉన్నా.. 10 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయి 248/8తో ఓటమి అంచున నిలిచింది. ఒకవైపు బౌన్సర్లు పరీక్ష పెడుతున్నాయి. మరోవైపు కంగారూల స్లెడ్జింగ్.. ఇలాంటి స్థితిలో లారా అసమాన పోరాటం సాగించాడు. మెక్‌గ్రాత్ వేసిన ఒక షార్ట్ పిచ్ బంతి హెల్మెట్‌కు బలంగా తగిలినా ఏకాగ్రత కోల్పోలేదు.
ధైర్యం నింపుతూ
గెలవాలంటే ఇంకా 60 పరుగులు కావాలి.. చేతిలో రెండే వికెట్లు ఉన్నాయి.. అవి కూడా ఆంబ్రోస్, వాల్ష్‌వి. కానీ బ్రయాన్ నమ్మకం కోల్పోలేదు. సహచరుల్లో ధైర్యం నింపుతూ అసాధారణంగా బ్యాటింగ్ చేశాడు. మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో కొట్టిన బ్యాక్‌ఫుట్ కట్ షాట్లు.. వార్న్, మెక్‌గిల్ బౌలింగ్‌లో క్రీజులో వదిలి ముందుకు వచ్చి ఆడిన లాఫ్టెడ్ స్ట్రోక్‌లు అద్భుతం. లారా ఇచ్చిన స్ఫూర్తితో 39 బంతుల పాటు ఆంబ్రోస్ నిలవడంతో.. తొమ్మిదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆంబ్రోస్ ఔయ్యే సమయానికి విండీస్ 6 పరుగులు చేస్తే చాలు.. కానీ వాల్ష్ స్ట్రైకింగ్. అతను అయిదు బంతులను అడ్డుకోవడంతో.. బ్రయాన్ విండీస్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. టెస్టు క్రికెట్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఉండొచ్చు.. కానీ ఆస్ట్రేలియా లాంటి జట్టుపై.. అదీ ఛేదనలో.. విపత్కర పరిస్థితిలో లారా ఆడిన ఈ ఇన్నింగ్స్‌కు వెల కట్టలేం.