టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన మంచి మనసును చాటుకున్నాడు. ఈ శుక్రవారం తాను 34వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, దిల్లీ సహ పరిసర ప్రాంతాల్లోని 34 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నాడు. అమితాబ్ షా యువా అన్‌స్టాపబుల్ ఫౌండేషన్ సహకారంతో తాను స్థాపించిన ఎన్జీఓ సంస్థ గ్రేసియా రైనా ద్వారా ఈ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపాడు. తాగునీటి సదుపాయం, బాలురు, బాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు నిర్మించడం, స్మార్ట్ తరగతి గదుల ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించాడు.
"నా పుట్టినరోజును ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు నాణ్యమైన విద్యకు అర్హులు. పాఠశాలల్లో మంచి నీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు ఉండాలి. వీటిని యువా అన్‌స్టాపబుల్ సహకారంతో గ్రేసియా రైనా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాం. మౌలిక సదుపాయాల వల్ల ఎన్నో వేల మంది విద్యార్థులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. ఇది మంచి ఆరంభం. భవిష్యత్తుల్లో మరిన్ని పాఠశాలలకు మా సాయాన్ని అందిస్తాం. ఇంతకన్నా గొప్పగా జన్మదిన వేడుకల్ని జరుపుకోలేను. ఇది మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.''
-సురేశ్ రైనా, టీమ్ఇండియా మజీ క్రికెటర్.
ఈ పాఠశాలల్లో ఆరోగ్య, శాస్త్రీయ అంశాలకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తామని రైనా తెలిపాడు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 15న రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇదీ చూడండి అతడికి కెప్టెన్సీ ఇస్తే మరో రోహిత్ అవుతాడు!