భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ఈ నెల 14 నుంచి టెస్ట్ సిరీస్ మొదలు కానుంది. ఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 22న రెండో టెస్టు మ్యాచ్ ఆరంభమవుతుంది. ఇది డే/నైట్ టెస్టు కావడం విశేషం. ఈ రెండు జట్లు ఇప్పటివరకు డే/నైట్ టెస్టు ఆడలేదు.
ఇక్కడ మ్యాచ్‌ను ప్రారంభించే ముందు గంట మోగించే సంప్రదాయం ఉంది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. నవంబరు 22 నుంచి 26 వరకు జరగనున్నఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు బంగ్లా ప్రధాని వస్తున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) తాజాగా వెల్లడించింది.
దిగ్గజాల రాక..
ఈ మ్యాచ్‌కు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ సహా పలువురు భారత జట్టు టెస్టు సారథులు హాజరుకానున్నారు.
దాదానే ఆధ్యుడు..
దాదా బంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన తర్వాత 2016లో ఈడెన్‌లో గంట ఏర్పాటు చేశాడు. అప్పట్నుంచి గంట మోగించిన తర్వాతే ఆట మొదలు పెడుతున్నారు. తొలిసారి ఆ గంటను మోగించిన వ్యక్తిగా కపిల్‌దేవ్ రికార్డుల కెక్కాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య 2016లో ఈ టెస్టు జరిగింది.

క్రికెట్ మ్యాచ్‌లకు ప్రధాని హాజరుకావడం కొత్తేమి కాదు. 2011 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌కు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించారు. ఆయన ఆ మ్యాచ్‌ను తిలకించారు. భారత్-పాక్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు నాటి పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ కూడా హాజరయ్యారు. ఇక భారత్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, రెండు టెస్టుల సిరీస్ కోసం నవంబరు 3న అడుగుపెట్టింది బంగ్లా జట్టు. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఇరుజట్ల మధ్య ఆఖరి మ్యాచ్ నాగపూర్ వేదికగా ఆదివారం జరగనుంది.