ఆస్ట్రేలియా క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ఐపీఎల్ జట్టు సహచరుడు బెన్ స్టోక్స్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లీష్ ఆల్‌రౌండర్లు ఎటువంటి కఠిన పరిస్థితులనైన ఎదుర్కొంటారని అన్నాడు. అందువల్లే స్టోక్స్ వంటి ఆటగాడిని ప్రతి కెప్టెన్ తమ జట్టులో ఉండాలని కోరుకుంటారని స్మిత్ పేర్కొన్నాడు.
"స్టోక్స్ ఆటను నేను చూశా. అతను ఎంతో గొప్ప ఆటగాడు. ప్రపంచకప్, ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్‌లో ఎంతో బాగా ఆడాడు. అంతే కాదు, ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా అన్నింట్లోనూ తన చేయి ఉండాలని కోరుకుంటాడు. స్టోక్స్ ఎప్పుడూ ప్రముఖ ఆటగాళ్లలో ఒకడిగా ఉండాలనుకుంటాడు. కఠిన పరిస్థితుల్లో జట్టును కాపాడేందుకు ఇటువంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం ఎంతో ముఖ్యం."
-స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా క్రికెటర్
ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌తో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించనుంది. దాదాపు ఏడు నెలల తర్వాత నిర్వహించే ఈ సిరీస్ కంటే ప్రస్తుతం గొప్పదేదీ లేదని స్మిత్ అభిప్రాయపడ్డాడు. "మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. లాక్డౌన్ కారణంగా ఫిబ్రవరి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాం. ఈ భిన్నమైన పరిస్థితుల్లో ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలి." అని స్మిత్ తెలిపాడు.
ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అన్ని జట్లు బయో సెక్యూర్ వాతావరణంలో ప్రోటోకాల్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది. ఇందులో ఇతర జట్లతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా లీగ్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది.