భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ).. ప్రీమియర్ ఫస్ట్-క్లాస్ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీని ఈ దఫా నిర్వహించట్లేదని ప్రకటించింది. 87 ఏళ్ల రంజీ చరిత్రలో ట్రోఫీని నిర్వహించకపోవడం ఇదే మొదటిసారని బీసీసీఐ స్పష్టం చేసింది. కొవిడ్ నేపథ్యంలో.. మెజార్టీ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు విజయ్ హజారే ట్రోఫీ నిర్వహణకు మొగ్గు చూపడమే దీనికి కారణం.
దీంతోపాటు అండర్-19 వన్డే, వినూ మన్కడ్ ట్రోఫీ, మహిళల పరిమిత ఓవర్ల టోర్నమెంట్లనూ జరుపుతామని బీసీసీఐ స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ రెండు నెలల పాటు రంజీ ట్రోఫీని నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది.
అంతకుముందు.. దేశవాళీ టోర్నీల నిర్వహణ అంశంపై రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు అభిప్రాయాలు తెలుపాల్సిందిగా.. బీసీసీఐ కార్యదర్శి జై షా లేఖలు రాశారు. ముస్తాక్ అలీ టోర్నీని విజయవంతంగా నిర్వహించడంపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, గతేడాది జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో బంగాల్, సౌరాష్ట్రలు తలపడ్డాయి. విజేతగా సౌరాష్ట్ర నిలిచింది.
ఇదీ చదవండి: దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణ దిశగా బీసీసీఐ